టాటా సన్స్, టాటా ట్రస్ట్స్ మధ్య జరుగుతున్న నాయకత్వ వివాదం ప్రస్తుతం వ్యాపార, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ కీలక ప్రకటన చేశారు. టాటా గ్రూప్ సారధ్య బాధ్యతల విషయంలో నోయెల్ టాటా వైపు నిలుస్తూ.. టాటా ట్రస్ట్స్ పాత్రను, సంస్థ వ్యవస్థాపక విలువలను కాపాడాలని సమర్థించారు.
టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్‌జీ టాటా.. ఆ కుటుంబ సభ్యులు దేశ పరిశ్రమలకు సోషల్ సర్వీస్ విలువలను అందించారని పవార్ ప్రశంసించారు. టాటా ట్రస్ట్స్ సామాజిక నిబద్ధత, సంస్థాగత పాత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ పరిరక్షించబడాలన్నారు. టాటా గ్రూప్ నాయకత్వంపై నిర్ణయం తీసుకునేటప్పుడు ట్రస్ట్స్ పాత్రను, సంస్థాగత ప్రక్రియలను పూర్తిగా గౌరవించడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు పవార్. మెజారిటీ షేర్‌హోల్డర్‌గా ఉన్న టాటా ట్రస్ట్స్ సమ్మతితోనే నాయకత్వ నిర్ణయాలు ఉండాలని అభిప్రాయపడ్డారు.
టాటా సన్స్‌లో దాదాపు 66 శాతం వాటాలను రతన్ టాటా ట్రస్ట్, దొరబ్జీ టాటా ట్రస్ట్ కలిగి ఉన్నాయని, ఈ యాజమాన్య నిర్మాణం యాదృచ్ఛికంగా జరగలేదని శరద్ పవార్ గుర్తుచేశారు. ముంబైలోని ప్రసిద్ధ టాటా మెమోరియల్ హాస్పిటల్, టిఫర్, టిస్,ఎన్‌సీపీఏ వంటి జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలు ఈ ట్రస్టుల ద్వారానే ఏర్పాటయ్యాయని కొనియాడారు. ట్రస్టుల పాత్రను బలహీనపరిస్తే దేశవ్యాప్తంగా ఉన్న ఈ ప్రముఖ సేవా సంస్థలపై కూడా ప్రభావం పడుతుందని హెచ్చరించారు శరత్ పవార్.
जमशेदजी टाटा आणि टाटा कुटुंबाने उद्योगाला समाजसेवेची मूल्याधिष्ठित दिशा दिली. त्यामुळे टाटा ट्रस्टची सामाजिक बांधिलकी आणि संस्थात्मक भूमिका जपली गेली पाहिजे. टाटा समूहाच्या नेतृत्वाबाबत निर्णय होताना संस्थात्मक प्रक्रिया आणि ट्रस्टच्या भूमिकेचा आदर होणं आवश्यक आहे. कारण महाराष्ट्राच्याच नव्हे तर देशाच्या विकासाशी, समाज जीवनाशी निरंतर जोडला गेलेला ‘टाटा समूहा’चा वारसा जपणं गरजेचं आहे.
— Sharad Pawar (@PawarSpeaks) September 22, 2026
టాటా గ్రూప్‌నకు మహారాష్ట్రతో విడదీయరాని అనుబంధం ఉందని, ఈ రాష్ట్రమే ఆ గొప్ప వారసత్వానికి కేంద్ర బిందువు అని పవార్ అన్నారు. చైర్మన్ నియామకంతో పాటు కీలక నిర్ణయాలపై ట్రస్ట్ నామినేట్ చేసిన డైరెక్టర్లకు ఉన్న అధికారాలను, సమ్మతి హక్కులను అందరూ గౌరవించాలని పేర్కొన్నారు. మొత్తానికి ఈ వివాదంలో నోయెల్ టాటా ట్రస్ట్స్ వాదనకు మద్దతుగా శరత్ పవార్ నిలవడం కార్పొరేట్ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. అటుతిరిగి ఇటుతిరిగి టాటాల వ్యాపార సామ్రాజ్యంలోని వివాదం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంటోందని నిపుణులు అంటున్నారు.
