హైదరాబాద్: నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్‌పై ఏసీబీ అధికారులు ఉరుములు ఉరిమినట్లు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఏకకాలంలో సోదాలు చేపట్టారు.
సమాచారం అందిన వెంటనే సెప్టెంబర్ 22, 2026 న లక్ష్మీ భాస్కర్‌కు చెందిన నివాసంతో పాటు ఆయన బంధువులు, బినామీలకు చెందిన సుమారు 7 ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో అవాక్కయ్యేలా భారీ ఎత్తున చరాస్తులు, స్థిరాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు.
భారీగా ఫ్లాట్లు, స్థలాలు
కూకట్‌పల్లిలోని హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక 4బీహెచ్‌కే, రెండు 3బీహెచ్‌కే ఫ్లాట్లు, మణికొండ, పెట్ బషీరాబాద్‌లో మరో 5 డబుల్ బెడ్రూం ఫ్లాట్లను గుర్తించారు. వీటితో పాటు యాదాద్రి, నందిగామ, శామీర్‌పేట్‌లలో 4 ఓపెన్ ప్లాట్లు, విశాఖపట్నంలో 800 గజాల ఖాళీ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బ్యాంకు ఖాతాల్లో రూ.41 లక్షలు, పోస్టాఫీస్ డిపాజిట్లు రూ.12 లక్షలు, ప్రైవేట్ ఫైనాన్స్‌లో రూ.35 లక్షలు, అలాగే మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.29.55 లక్షల పెట్టుబడులను అధికారులు గుర్తించారు. ఇంట్లో లెక్క తేలని 517.8 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణాల కోసం జాగ్వార్, ఆడీ, టాటా నెక్సాన్ కార్లతో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్, వెస్పా, యాక్టివా, యమహా వంటి పలు ద్విచక్ర వాహనాలను కూడా గుర్తించారు.
