బ్లడ్ బ్యాంక్ ఆరోపణలపై మెగాస్టార్ ఫైర్.. నా రెమ్యునరేషన్ ముందు అవెంత?.. ఫ్యాన్స్ మీట్‌లో చిరు కామెంట్స్!

బ్లడ్ బ్యాంక్ ఆరోపణలపై మెగాస్టార్ ఫైర్.. నా రెమ్యునరేషన్ ముందు అవెంత?.. ఫ్యాన్స్ మీట్‌లో చిరు కామెంట్స్!

తనపై వచ్చే విమర్శలు, ఆరోపణలకు సంయమనంతో భరించే మెగాస్టార్ చిరంజీవి తొలిసారి ఘాటుగా రియాక్ట్ అయ్యారు.  హైదరాబాద్‌లో నిర్వహించిన 'మెగా యూత్ ఫోర్స్' (MYF) అభిమానుల ఆత్మీయ కలయిక వేదికలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన మనసులోని ఆవేదనను బయటపెట్టారు..47 ఏళ్లకు పైగా మూడు తరాల అభిమానులు చూపుతున్న ఆదరాభిమానాలకు చిరంజీవి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత లైఫ్‌స్టైల్, క్రమశిక్షణతో పాటు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై కొందరు చేస్తున్న ఆరోపణలపై సంచలన కామెంట్స్ చేశారు.

కాలం దాటిపోతే తిరిగి రాదు..

డబ్బు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు.. కానీ క్షణం కాలం దాటిపోతే తిరిగి రాదు. కేవలం చిరంజీవిని ప్రేమించడం కాదు, ఆయన ఎలా పైకి వచ్చాడు, ఎంత క్రమశిక్షణ పాటించాడనేది ముఖ్యం అని  మెగాస్టార్ యువతకు పిలుపునిచ్చారు. 70 ఏళ్ల వయసులోనూ తాను ఎంతో ఎనర్జిటిక్‌గా ఉండటానికి రోజూ ఉదయం 4:30 గంటలకే నిద్రలేవడం, వ్యాయామం, సమయపాలన కారణమని వెల్లడించారు. జార్‌లో పెద్ద రాళ్లు (లక్ష్యాలు) వేసిన తర్వాతే ఇసుక (విమర్శలు) పడుతుందనే ఫిజిక్స్ ఉదాహరణతో ఆశయ సాధనపై మైండ్ సెట్ ఎలా ఉండాలో వివరించారు.

బ్లడ్ బ్యాంక్ వివాదంపై ఓపెన్ కామెంట్స్..

సమాజ సేవ కోసం ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్‌పై 'రక్తం అమ్ముకుంటున్నారు' అంటూ కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని చిరంజీవి తీవ్రంగా ఖండించారు. సినిమాల్లో నాకున్న రెమ్యూనరేషన్‌తో పోలిస్తే.. ఎన్ని కోట్ల రక్తపు ప్యాకెట్లు అమ్మితే నాకు ఆ డబ్బు వస్తుంది? విమర్శలు చేసేముందు కొంచెం బుద్ధితో ఆలోచించాలి అని అసహనం వ్యక్తం చేశారు. రూపాయి విరాళం తీసుకోకుండా తన సొంత కష్టార్జితంతోనే బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నానని, అభిమానుల రక్తాన్ని అమ్ముకునే నీచమైన ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు.

ఇదే క్రమంలో బాబి కొల్లి దర్శకత్వంలో రాబోతున్న 'కాకా 'సినిమాలో తన పవర్ ఫుల్ క్యారెక్టర్ పేరు 'కదిరి కాళీదాస్' అని లీక్ చేసి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపారు. హీరోల మధ్య, అభిమానుల మధ్య హెల్దీ వాతావరణాన్ని ప్రోత్సహించింది తానేనని చెప్పారు... చిరంజీవి ఫ్యాన్స్ అంటే సమాజంలో గర్వకారణంగా ఉండాలని పిలుపునిచ్చారు. 'మెగా యూత్ ఫోర్స్' (MYF) అభిమానుల ఆత్మీయ కలయిక వేదికగా మెగాస్టార్ చేసిన ఈ  వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమవుతున్నాయి..