న్యూఢిల్లీ, వెలుగు: సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజల్లో కేటీఆర్, హరీశ్‌రావు విషబీజాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి విద్యార్థులకు వ్యతిరేకం కాదని, పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో నాశనమైన విద్యా వ్యవస్థను గాడిలో పెడుతున్నారని చెప్పారు. పరీక్ష పేపర్ల లీకేజీలు బీఆర్‌ఎస్ హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు.
పీసీసీ మీడియా కమిటీ చైర్మన్‌గా తనను నియమించినందుకు శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ తదితరులను కలిసి చామల కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి–బనకచర్ల అంశంలో కేంద్రం వెనక్కి తగ్గడం వెనుక సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కృషి ఉందన్నారు.
హరీశ్‌రావు, కేటీఆర్ మరోసారి నీళ్ల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి తెలంగాణ సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఒక్కటేనంటూ విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ సోషల్ మీడియాకే పరిమితమైందని, ఆ పార్టీ తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పదేండ్లు కేసీఆర్ నిజాం నవాబులా పాలించారని విమర్శించారు. ప్రజలకు కష్టాలు వస్తే ఆనందించే వైఖరిని కేటీఆర్, హరీశ్‌రావు మానుకోవాలని హితవు పలికారు.
