గణేష్ పండుగ ముగింపు దశకు వచ్చింది. ఇప్పటికే నవరాత్రులు పూర్తవుతుండటంతో నిమజ్జనాల జోరు కొనసాగుతోంది. అయితే 2026 సెప్టెంబర్ 25న హైదరాబాద్ లో మహానిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బాలాపూర్, ఖైరతాబాద్ వంటి భారీ గణనాథుల నిమజ్జనం సందర్భంగా భారీ ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు జాయింట్ సీపీ జోయల్ డెవిస్ తెలిపారు.
శుక్రవారం (సెప్టెంబర్ 25) ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ తెలిపారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు ప్రధాన శోభాయాత్ర కొనసాగుతుందని చెప్పారు. విగ్రహాలు తరలించే వాహనాలకు మాత్రమే ప్రధాన రూట్‌లో అనుమతి ఉంటుందన్నారు.
NTR మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేక ఆంక్షలు ఉంటాయని తెలిపారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పైనా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పారు. పరిస్థితిని బట్టి ఆంక్షల సమయం పొడిగించే అవకాశం ఉంటుందన్నారు. ప్రధాన శోభాయాత్ర మార్గాల్లో సైడ్ రోడ్లు, లేన్లకు బారికేడింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
వెస్ట్–ఈస్ట్ రాకపోకలకు బషీర్‌బాగ్‌లో మాత్రమే క్రాసింగ్ ఉంటుందన్నారు. వాహనదారులు ఇన్నర్ Ring Road, ORR వినియోగించాలని పోలీసులు సూచించారు. ప్రయాణీకులు MJ మార్కెట్, అబిడ్స్, లిబర్టీ, రాణిగంజ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ట్యాంక్‌బండ్, NTR మార్గ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా వైపు వెళ్లొద్దని హెచ్చరించారు.
హెవీ కమర్షియల్ వాహనాలు, ట్రైలర్లకు సిటీ ఎంట్రీపై ఆంక్షలు విధించారు. లోకల్ లారీలు, నిర్మాణ వాహనాలకు ప్రత్యేక నిషేధం విధించారు. RTC సిటీ బస్సులకూ భారీ డైవర్షన్లు ఉండనున్నట్లు చెప్పారు.
ప్రైవేట్ ట్రావెల్ బస్సులు నగరంలోకి రాకుండా ORR వైపు మళ్లించనున్నారు. ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులు PVNR ఎక్స్‌ప్రెస్‌వే లేదా ORR వినియోగించాలని సూచించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. నిమజ్జనం వీక్షించేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. ప్రజలు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించి నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
