హైదరాబాద్‌లో నకిలీ వైద్యుడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గోల్కొండలోని హిక్మా సెహత్ కేర్ సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్, పోలీసులు కలిసి దాడులు నిర్వహించారు. ఎలాంటి గుర్తింపు పొందిన వైద్య అర్హత, చెల్లుబాటు అయ్యే వైద్య లైసెన్స్ లేకుండానే వైద్యం చేస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.
పోలీసుల కథనం ప్రకారం.. మహమ్మద్ అద్నాన్ అనే వ్యక్తి కేవలం ఇంటర్ CEC వరకు చదివి, డాక్టర్‌గా చలామణి అవుతున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో అద్నాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అద్నాన్‌తో పాటు అతడి తల్లి సబా ఖాన్ అలియాస్ ముహమ్మదీ బేగం, సోదరుడు మహమ్మద్ ఫైజాన్ కూడా ఈ వ్యవహారంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ పరారీలో ఉన్నట్లు సమాచారం.
ముగ్గురూ కలిసి తమను వంశపారంపర్య హకీమ్‌లుగా ప్రచారం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా కూడా వైద్య సేవల పేరుతో ప్రచారం చేసినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా డాక్టర్ అద్నాన్ అఫీషియల్ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం సాగినట్లు తెలిపారు.
హిక్మా సెహత్ కేర్ సెంటర్‌లో లైంగిక సమస్యలు, శ్వాస సంబంధిత సమస్యలు, ఛాతీ నొప్పి వంటి వాటికి కూడా చికిత్స అందించినట్లు పోలీసులు చెబుతున్నారు. కిడ్నీ, పక్కటెముకలు, మూత్ర సంబంధిత సమస్యలకు సంబంధించిన ప్రిస్క్రిప్షన్లు కూడా గుర్తించినట్లు వెల్లడించారు.
దాడుల్లో లేబుల్స్ లేని భారీ మొత్తంలో మందుల పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మందుల బాటిళ్లపై సాధారణ పేర్లకు బదులుగా మార్కర్ పెన్‌తో కోడ్ పేర్లు రాసి ఉన్నట్లు గుర్తించారు.
SR, EGP, MF, KK, WD వంటి కోడ్ పేర్లతో ఉన్న 160కిపైగా బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే తల్బీనా పౌడర్‌కు సంబంధించిన 20 ప్యాకెట్లు లభించగా, ఒక్కో ప్యాకెట్ బరువు కిలోగా ఉన్నట్లు వెల్లడించారు.
వైద్య అర్హతలు లేకుండా చికిత్స చేయడం, మందుల వినియోగం, వాటి తయారీ లేదా సరఫరాకు సంబంధించిన అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న మందులు, పౌడర్లను పరిశీలించి వాటి స్వభావం, వినియోగం తదితర అంశాలను నిర్ధారించాల్సి ఉంది.
ఈ కేసులో అద్నాన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, పరారీలో ఉన్న అతడి తల్లి సబా ఖాన్ అలియాస్ ముహమ్మదీ బేగం, సోదరుడు మహమ్మద్ ఫైజాన్ కోసం గాలిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
