డీజే సౌండ్ కారణంగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గణేష్ నవరాత్రులలో డీజే మోత భక్తుల జీవితాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. పండుగ ఊరేగింపుల్లో శృతిమించిన డీజే శబ్దాలు చిన్నారుల నుంచి యువకుల వరకు ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా హై డెసిబుల్స్ తో భారీ సౌండ్ సిస్టమ్స్ ప్రాణాలు తీస్తున్నాయి. గడిచిన రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఐదు నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. ఇది తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా ఇదే మోత.. తాజాగా యూపీలోని బలరాంపూర్ లో ఇలాంటిదే మరో దారుణం జరిగింది.
ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ లో దారుణం జరిగింది. గణేష్ నిమజ్జన ఊరేగింపులో మితిమీరిన మోతాదులో వినిపించిన డీజే శబ్దాల ధాటికి డివైన్ పబ్లిక్ స్కూల్ కు చెందిన 8 ఏళ్ల చిన్నారి క్లాస్ రూమ్ లోనే అకస్మాత్తుగా కుప్పకూలింది. ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సీసీటీవీలో రికార్డయిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ఇది ఒక్కటే కాదు.. హైదరాబాద్ రామ్ నగర్ లో శనివారం రాత్రి గణేష్ ఆగమన్ ఊరేగింపులో 19 ఏళ్ల బీటెక్ విద్యార్థి ఎస్. బద్రీనాథ్ డీజే సౌండ్ కు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి చెందాడు. భారీగా జనం, ఊపిరాడని స్థితితో, చెవులు చిల్లులు పడేలా డీజే మోతే కారణంగా బద్రీనాథ్ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ డీజేలను నిషేధించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
నారాయణపేట జిల్లాలో పెళ్లి వేడుకలో డీజేకు డ్యాన్స్ చేస్తూ 17 ఏళ్ల యువకుడు గుండెపోటుతో కుప్పకూలాడు. గడిచిన రెండు రోజుల్లోనే తెలంగాణ, ఏపీలో గణేష్ వేడుకల్లో ఐదుగురు గుండెపోటుతో మృతి చెందారని, శ్రమతో కూడిన డ్యాన్స్, భారీ డీజే సౌండ్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఏపీలోని తాడేపల్లిగూడెంలో వినాయక నిమజ్జన వేడుకల్లో డీజే పాటలకు స్టెప్పులేస్తూ 48 ఏళ్ల కాకర్లమూడి ఏసు మృతి చెందడంతో డీజేలను నిషేధించాలని డిమాండ్స్ పెరుగుతున్నాయి.
డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం 85 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం గుండె లయను దెబ్బతీస్తుంది. పిల్లలు, వృద్ధులు, గుండె బలహీనత ఉన్నవారికి ఇది ప్రాణాంతకం. అయినా రూల్స్ పక్కనపెట్టి 100నుంచి-120 డెసిబుల్స్ తో డీజేలు పెడుతున్నారు.
ఇప్పటికే పలు జిల్లాల్లో పోలీసులు చర్యలు చేపట్టారు. హై డెసిబుల్ డీజే సౌండ్ సిస్టమ్స్ పై నిషేధం విధిస్తున్నారు. కానీ అనుమతులు ఇవ్వడం, తనిఖీలు లేకపోవడంతో ఇలాంటి విషాద ఘటనలు జరుగుతున్నాయి. డీజే నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తున్నాయి.
How loud is too loud?
— Nabila Jamal (@nabilajamal_) September 23, 2026
A 7 yr old child is dead!
In Balrampur, Class 2 student Vaishnavi Tiwari suddenly fell ill inside Divine Public School while a Ganesh Visarjan procession with loud DJ music was passing nearby
She was rushed to hospital but could not be saved
Her family… pic.twitter.com/YIOK2UNCak
