రష్యన్ క్రూడ్‌పై ట్రంప్ కన్ను.. భారత్‌కు ఎందుకింత టెన్షన్?

రష్యన్ క్రూడ్‌పై ట్రంప్ కన్ను.. భారత్‌కు ఎందుకింత టెన్షన్?

రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా ఒత్తిడి మరింత పెరుగుతోంది. అమెరికా సెనేట్ తాజాగా Lindsey O. Graham Sanctioning Russia Actను ఆమోదించడంతో భారత్, చైనా వంటి రష్యన్ ఆయిల్ కొనుగోలుదారులపై ఆర్థిక ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఈ బిల్లు చట్టంగా మారితే.. రష్యా నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ కొనటం కొనసాగించే కొన్ని దేశాల నుంచి అమెరికా దిగుమతులపై గరిష్ఠంగా 100 శాతం టారిఫ్ విధించే అధికారం ట్రంప్‌కు లభిస్తుంది.

భారత్‌పైనే ఎందుకు ఫోకస్?
భారత్‌కు ఈ పరిణామం కీలకం. కెప్లర్ డేటా ప్రకారం జూలైలో భారత్ రష్యా నుంచి రోజుకు 2.78 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ దిగుమతి చేసుకుంది. భారత్ మొత్తం క్రూడ్ దిగుమతులు రోజుకు 4.96 మిలియన్ బ్యారెళ్లుగా ఉండగా.. అందులో రష్యా వాటా సగానికి పైగా ఉంది. అంటే రష్యా ఇప్పుడు భారత్‌కు అతిపెద్ద క్రూడ్ సరఫరాదారు. తక్కువ ధరలు, రిఫైనరీలకు లభించే మార్జిన్లు, ఇతర ప్రాంతాల్లో సరఫరా అంతరాయాలు రష్యన్ ఆయిల్‌పై ఆధారాన్ని పెంచుతున్నాయి.

అసలు ముప్పు ఎగుమతులకే..
అమెరికా చర్య వల్ల భారత్‌కు నేరుగా ఎదురయ్యే అతిపెద్ద ప్రమాదం ఇంధన రంగంలో కాకుండా ఎగుమతులపై ఉండొచ్చు. అమెరికా భారత్‌కు అతిపెద్ద ఎగుమతి మార్కెట్లలో ఒకటి. ఫార్మాస్యూటికల్స్, ఇంజినీరింగ్ గూడ్స్, టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్, జెమ్స్ అండ్ జువెలరీ, మెరైన్ ప్రొడక్ట్స్ వంటి రంగాలు అమెరికా మార్కెట్‌పై భారీగానే ఆధారపడి ఉన్నాయి. రష్యన్ ఆయిల్ కొనుగోళ్ల కారణంగా భారత్‌పై 100 శాతం టారిఫ్ ప్రకటిస్తే ట్రంప్.. అమెరికా మార్కెట్లో భారత ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగి పోటీ సామర్థ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపై మోపాలా, తమ మార్జిన్లు తగ్గించుకోవాలా అన్న డైలమాలోకి వెళ్లిపోతాయి. 

అయితే ఇది వెంటనే అమల్లోకి వచ్చే నిర్ణయం కాదు. సెనేట్ ఆమోదం తర్వాత బిల్లు అమెరికా ప్రతినిధుల సభలోనూ పాస్ కావాలి. ఆ తర్వాత అధ్యక్షుడి ఆమోదం, అమలు ప్రక్రియ ఉంటుంది. అంతేకాదు చట్టం అయినా 100 శాతం టారిఫ్ తప్పనిసరి కాదు. అమెరికా అధ్యక్షుడికి జాతీయ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా మినహాయింపులు ఇచ్చే అధికారం కూడా ఉంటుంది.

భారత్ ముందు మూడు ఆప్షన్లు..
ఇప్పుడు భారత్ ముందు రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను తగ్గించడం, అమెరికాతో చర్చించి మినహాయింపులు సాధించడం, ఇతర దేశాల నుంచి క్రూడ్ దిగుమతులను పెంచి రష్యాపై ఆధారాన్ని క్రమంగా తగ్గించడం వంటి మార్గాలు ఉన్నాయి. అయితే ప్రత్యామ్నాయ క్రూడ్ ఖరీదైతే దేశం దిగుమతి బిల్లు, ఇంధన ధరలపై ఒత్తిడి పెరగొచ్చు.

ALSO READ : మిడిల్‌క్లాస్‌ని కలవరపెడుతున్న గోల్డ్ ర్యాలీ.. 

అసలు పరీక్ష ఇదే!
భారత్‌కు ఇది కేవలం రష్యా-అమెరికా వివాదం కాదు. చౌక రష్యన్ ఆయిల్‌తో ఇంధన ఖర్చును తగ్గించుకోవడమా.. లేక అమెరికా మార్కెట్‌ను కాపాడుకోవడమా? అన్న వ్యూహాత్మక ప్రశ్నగా మారింది. రష్యా నుంచి వచ్చే ప్రతి బ్యారెల్ ఇప్పుడు భారత్‌కు కేవలం ఇంధన ఖర్చులను మాత్రమే కాదు.. అమెరికా మార్కెట్‌లో ఎదురయ్యే భవిష్యత్ టారిఫ్ రిస్క్‌ను కూడా లెక్కించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది.