చెత్త డబ్బులు ప్రాపర్టీ ట్యాక్స్లోనే.. ఇక నుంచి నేరుగా వసూళ్లు బంద్.. చిట్చాట్లో సీఎంసీ కమిషనర్ సృజన

చెత్త డబ్బులు ప్రాపర్టీ ట్యాక్స్లోనే.. ఇక నుంచి నేరుగా వసూళ్లు బంద్.. చిట్చాట్లో సీఎంసీ కమిషనర్ సృజన
  • స్వచ్ఛ కార్మికుల్లో ఆసక్తి ఉన్నవారికి ఈవీ ఆటోలు  
  • కలెక్షన్​ను బట్టి వారికి జీతాలు 
  • త్వరలో చికెన్, మటన్ షాపులపై రైడ్స్​ 
  • పిల్లల కోసం చిల్డ్రన్ ఫ్రెండ్లీ పాలసీ
  • చిట్​చాట్​లో సీఎంసీ కమిషనర్​ సృజన

హైదరాబాద్ సిటీ, వెలుగు: సీఎంసీ పరిధిలోని ప్రజల నుంచి త్వరలో చెత్త పన్నును డైరెక్ట్​తీసుకునేది ఉండదని, ఆస్తి పన్నుతో కలిపి తీసుకుంటామని సైబరాబాద్​మున్సిపల్​కార్పొరేషన్​కమిషనర్​సృజన స్పష్టం చేశారు. తొందర్లోనే ఎలక్ట్రిక్ (ఈవీ) స్వచ్ఛ ఆటోలను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని, ప్రస్తుతం పనిచేస్తున్న స్వచ్ఛ ఆటో కార్మికుల్లో ఆసక్తి ఉన్న వారికి ఆ ఆటోలను అందజేస్తామని చెప్పారు.  

వారు సేకరించిన చెత్త సేకరించిన ఇండ్లు, పనితీరు ఆధారంగా వారికి జీతాలు చెల్లించే విధానాన్ని అమలు చేస్తామని వివరించారు. శుక్రవారం సీఎంసీ హెడ్ ఆఫీసులో ఆమె మీడియా తో చిట్‌‌‌‌చాట్‌‌‌‌ నిర్వహించారు. ఒక్కొ కార్మికుడికి 452 నుంచి 500 ఇండ్లు వచ్చేలా ప్లాన్ చేస్తామని, దీనివల్ల చెత్త సేకరణ సేవలు మరింత సమర్థవంతంగా చేయడానికి అవకాశం ఉండడమే కాకుండా కార్మికులకు ఆదాయం వస్తుందన్నారు. వ్యాపార కేంద్రాలకు సంబంధించి నో బిన్ నో ట్రేడ్ విధానాన్ని  అమలు చేస్తామన్నారు.  

తోపుడు బండ్ల పై వ్యాపారం చేసే వ్యక్తి  నుంచి మొదలుకుంటే పెద్ద మాల్స్​వరకు డస్ట్​బిన్​వాడే విధానాన్ని తీసుకువస్తామన్నారు. చెత్త విషయంలో ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని,  అయినా వారు రూల్స్​బ్రేక్​చేస్తే భారీగా జరిమానాలు విధిస్తామన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ నిధులు రూ.138కోట్లు వచ్చాయని, వీటితో స్వీపింగ్ మెషీన్ల కొనుగోలు, ఇతర పనులకు వినియోగిస్తామన్నారు. సీఎంసీలోని 5వేల మంది శానిటేషన్ కార్మికులకు వారి డ్యూటీల గురించి ఆరోగ్య జాగ్రత్తలపై ట్రైనింగ్ క్లాసులు ఇస్తామన్నారు. 

వాటర్​ హోల్డింగ్​ స్ట్రక్చర్లు కడతాం 

సీఎంసీ పరిధిలో వర్షాలు పడినప్పుడే కాకుండా, రోడ్లపై గుంతల వల్ల కూడా ట్రాఫిక్ జామ్ అవుతుందని, వాటి రిపేర్లతో పాటు అవసరమైన చోట రీ కార్పెటింగ్ చేస్తామన్నారు. సీఆర్ఎంపీ టెండర్లు కొనసాగుతున్నాయని, దీని కింద అప్పగించే రోడ్లు కాకుండా మిగతా రోడ్లపై పనులు చేస్తామన్నారు.  సీఎంసీలో 54 వాటర్ లాగింగ్ పాయింట్లు ఉన్నాయని, ఇక్కడ కొన్నిచోట్ల 5 నుంచి 10 లక్షల లీటర్ల కెపాసిటీతో వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లను నిర్మిస్తామన్నారు. 

మియాపూర్ ఘటనపై చర్యలు తీసుకుంటం...

మియాపూర్ వైశాలీనగర్ లో నాలాలో ఓ వ్యక్తి కొట్టుకుపోయిన విషయంపై స్పందించిన కమిషనర్​రెస్క్యూ ఇంకా కొనసాగుతోందని, 10 రోజులుగా ఎన్ డీఆర్ఎఫ్, ఎస్ డీ ఆర్ఎఫ్, హైడ్రా బృందాలు వెతుకుతున్నాయన్నారు. మియాపూర్​ఘటన జరిగిన చోట వర్షాకాలం తవ్వకాలు జరపొద్దని ఆదేశాలు ఉన్నా పనులు ఎలా చేస్తున్నారని ప్రశ్నించగా..ఎప్పుడో ఇచ్చిన అనుమతులతో ఆ పనులు చేస్తున్నారన్నారు. అక్కడ బారికేడ్లు అడ్డుగా పెట్టినా చాలామంది వాటిని దాటుకొని వెళ్తున్నారన్నారు. బాలయ్య కూడా అలా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారన్నారు. బాలయ్య ఘటనపై అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఏమన్నా ఉంటే చర్యలు తీసుకుంటామని, దానికి సంబంధించిన విచారణ కూడా 
జరుగుతోందన్నారను.  

సంతలపై కంప్లయింట్స్​ వస్తే తొలగిస్తం...

కాలనీలు, రోడ్ల పక్కన వారాంతపు మార్కెట్లపై ఫిర్యాదులు వస్తే ఆ మార్కెట్​ను ఎత్తివేస్తామన్నారు. మార్కెట్ ఏర్పాటు చేస్తే చుట్టూ ఉన్న కాలనీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత వ్యాపారులకు ఉందన్నారు. ఇప్పుడైతే కొత్తవాటికి అనుమతులు ఇవ్వడంలేదన్నారు. మార్కెట్లు ప్రజలకు అవసరమని, అందుకోసం ఖాళీగా ఉండే ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తామన్నారు.  

ఫుట్​పాత్​లపై సీరియస్​గా ఉన్నాం  

ఫుట్ పాత్ లపై ఆక్రమణలకు సంబంధించి సుప్రీం కోర్టు గైడ్ లెన్స్ ను పాటిస్తున్నామని, ఫుట్ పాత్ లపై ఆక్రమణలను కూల్చివేస్తున్నామని, ఇందుకోసం వాక్ ఫ్రీ పేరుతో ప్రతి శనివారం డ్రైవ్ నిర్వహిస్తున్నామని కమిషనర్​చెప్పారు. ఫుట్ పాత్ ఆక్రమణలకు నోటీసులు లేకుండా కూల్చివేసే అధికారం ఉన్నప్పటికీ ముందుస్తుగా సమాచారం ఇచ్చి వారంతట వారు తీయకపోతే తామే కూల్చివేస్తున్నామన్నారు. ఒకసారి కూల్చిన తరువాత మరోసారి అదే తప్పు చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఇప్పటివరకు 290 ఆక్రమణలు తొలగించినట్లు తెలిపారు.

పిల్లల కోసం కొత్త పార్కులు  

త్వరలో కమిషరేట్​పరిధిలో చిల్డ్రన్ ఫ్రెండ్లీ పాలసీని తీసుకురానున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ఇందుకోసం యూనిసెఫ్‌‌‌‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకోనున్నామని తెలిపారు. పిల్లలకు అవసరమైన ప్రాంతాల్లో కొత్త పార్కులు ఏర్పాటు చేయడంతో పాటు, ఆట స్థలాలు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. ఇందుకోసం నేరుగా పిల్లల వద్దకే వెళ్లి వారి మనసులో ఏముందో తెలుసుకుని..వారు కోరిన వాటిల్లో సాధ్యమైనవి నెరవేరుస్తామన్నారు. దీని కోసం ప్రత్యేక క్యాంపెయిన్స్ నిర్వహిస్తామన్నారు.