వెలుగు స్పెషల్: ఖాకీ జీవితంలో ఎన్నో కోణాలు.. పోలీసు ఓ నిరంతర బాధ్యత

వెలుగు స్పెషల్: ఖాకీ జీవితంలో ఎన్నో కోణాలు.. పోలీసు ఓ నిరంతర బాధ్యత

సమాజం ప్రశాంతంగా, భద్రంగా జీవించాలంటే పోలీసు వ్యవస్థ కీలకం. నేరాల నివారణ, దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణ నుంచి ఉగ్రవాదం, సామాజిక ఉద్రిక్తతలు, ప్రజా ఆందోళనల నియంత్రణ వరకు పోలీసులు నిరంతరం విధుల్లో ఉంటారు. 

కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి ప్రాణాలకు తెగించి పనిచేసే పోలీసు జీవితంలోని ఎన్నో కోణాలను సామాన్య పాఠకుడికి పరిచయం చేసే గ్రంథమే మాజీ పోలీసు అధికారి పెద్దిరెడ్డి తిరుపతిరెడ్డి రచించిన ఆదర్శపథంలో పోలీసు సమగ్ర పరిశీలన.

1970లో సబ్ ఇన్ స్పెక్టర్ పోలీసు శాఖలో అడుగుపెట్టిన తిరుపతిరెడ్డి హైదరాబాద్ మహానగర పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్, రాష్ట్రస్థాయి విభాగాల తోపాటు కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ స్కూల్ లో వివిధ హోదాల్లో పనిచేశారు.

 శాస్త్రీయ నేర పరిశోధనలో జాతీయస్థాయి పోటీల్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించి రాష్ట్రానికి గుర్తింపు తీసుకొ చ్చారు. సేవలకు గుర్తింపుగా రాష్ట్రపతి పోలీస్ మెడల్స్ అందుకున్నారు. ఉద్యోగ జీవితంలో ఎదురైన అను భవాలు, వ్యవస్థపై ఉన్న అవగాహన ఈ గ్రంథానికి ప్రధాన బలంగా నిలిచాయి. 

ఐదు అధ్యాయాల్లో పోలీసు వ్యవస్థ

మొత్తం ఐదు అధ్యాయాలుగా సాగిన ఈ గ్రంథం పోలీసు వ్యవస్థను చారిత్రక, పరిపాలన, సామాజిక కోణాల్లో పరిశీలిస్తుంది. ప్రముఖుల ముందుమాటలు, అభినందనలు, ప్రశంసలు కూడా పుస్తకానికి
ప్రత్యేకతను తీసుకొచ్చాయి. 

తొలి అధ్యాయంలో భారత స్వాతంత్ర్యోద్యమం, బ్రిటిష్ పాలన, జాతీయో ద్యమకారుల త్యాగాలు, దేశ సమగ్రతను కాపాడ టంలో పోలీసుల పాత్రను వివరించారు. మితవాద, అతివాద, గాంధేయ ఉద్యమ దశలను ప్రస్తావిస్తూ చరిత్రలో మరుగునపడిన పోరాట వీరుల త్యాగాలను, కూడా గుర్తుచేశారు. 

స్వాతంత్య్రం తర్వాత జాతీయ సమగ్రత పరిరక్షణలో పోలీసుల పాత్రతోపాటు పోలీసు వ్యవస్థలోని రిజర్వేషన్లు, వివిధ విభాగాలు, రాజకీయ ప్రభావం వంటి అంశాలను ప్రస్తావించి, జాతీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు కొన్ని సూచనలు చేశారు.

రెండో అధ్యాయం పోలీసు ఆవిర్భావం, వికాస చరి త్రపై కేంద్రీకృతమైంది. ప్రాచీన భారతంలో పోలీసు తరహా వ్యవస్థ నుంచి మొఘల్, స్వతంత్ర భారతంలో ఏర్పడిన ఆధునిక పోలీసు వ్యవస్థ వరకు పరిణామా న్ని వివరించారు. కౌటిల్యుడి సప్తాంగ సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూ అప్పటి రాజ్యపాలనలో భద్రతా వ్యవస్థ ప్రాధాన్యాన్ని వివరించారు.

స్వతంత్ర భారత పోలీసు శాఖలో కానిస్టేబుల్ నుంచి డైరెక్టర్ జనరల్ వరకు వివిధ హోదాలు, నియామకాలు, విధులు, అధికారాలు, బాధ్యతలను రచయిత వివరించారు. రాష్ట్ర, జిల్లా, మున్సిపల్, నగర స్థాయి పోలీసు పరిపాలనతోపాటు ట్రాఫిక్, క్రైమ్, మహిళా విభాగాలు, పోలీస్ స్టేషన్లు, అవుట్ పో స్థుల వరకు వ్యవస్థ ఎలా పనిచేస్తుందో? పరిచయం చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 18 సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్, 20 కేంద్ర సంస్థల గురించిన సమాచారాన్నీ పొందుపరిచారు.

'పోలీసంటే?' అనే ప్రశ్న

మూడో అధ్యాయం 'పోలీసంటే?' అనే శీర్షికతో సాగుతుంది. పోలీసు వ్యక్తిత్వం, నాయకత్వలక్షణా లు, చట్టం, ప్రజలతో సంబంధాలు, వ్యక్తిత్వ వికాసం, పోలీసుల సంక్షేమం, సమర్ధత వంటి అంశాలను ఇందులో చర్చించారు. పౌరులతో గౌరవప్రదమైన సంబంధాలు ఏర్పరచుకోవడం, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించడం వంటి అంశాలపై దృష్టి పెట్టారు.

 ఇదే అధ్యాయంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర పోలీసులకు అక్షర నివాళి అర్పించారు. సరిహద్దుల్లో దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన సైనికులతో పాటు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద, హింసాత్మక శక్తులను ఎదుర్కొంటూ ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యా గాలను గుర్తుచేశారు. 

వ్యవస్థలోని సమస్యలపై ప్రశ్నలు

నాలుగో అధ్యాయంలో శాంతిభద్రతలు, పోలీసుల ఆలోచనా విధానం, పోలీసు మీడియా సంబంధాలను ప్రస్తావించారు. ప్రజా భద్రతకు భంగం కలిగిన ప్పుడు పోలీసు శాఖ ఎదుర్కొనే విమర్శలు, క్లిష్ట పరి స్థితుల్లో అధికారులు చూపాల్సిన నిబ్బరం గురించి రచయిత చర్చించారు. 

ఆర్థిక నేరాలు, అవినీతి, వివిధ స్కాములు, రాజకీయ ప్రభావం, పాలనా వ్యవస్థలో ఏర్పడే సంక్షోభం, క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలోని చిక్కు లను కూడా పరిశీలించారు. అవినీతిని ఎదుర్కోవడం లో పౌరుల బాధ్యతను గుర్తుచేస్తూ పోలీసు వ్యవస్థలో ఇంకా రావాల్సిన మార్పులపై ప్రశ్నలు సంధించారు.
 

ఆదర్శంగా వెంకట్రామారెడ్డి
 
ఐదో అధ్యాయం నిజాం కాలంలో పోలీసు కమిష నర్​గా పనిచేసిన రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి జీవితానికి అంకితం. పోలీసు అధికారిగా తన బాధ్య తలను నిర్వర్తించడంతోపాటు విద్య, సమాజసేవకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యాన్ని రచయిత వివరించారు. 

హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఆయన స్థాపించిన విద్య, సామాజిక సంస్థల గురించి కూడా ప్రస్తావించారు. యువ పోలీసు అధికారులకు మార్గద ర్శకంగా వెదిరె రమణారెడ్డి జీవితం. పోలీసు వృత్తిలో పాటించాల్సిన కొన్ని నియమాలను పొందుపరిచారు. 'ఆదర్శ కొత్వాలు' పేరుతో వెంకట్రామారెడ్డి సేవలను కొనియాడుతూ రచయిత రాసిన పద్యాలు కూడా ఇందులో ఉన్నాయి. 

పోలీసు.. ఓ నిరంతర బాధ్యత

మొత్తంగా ఈ గ్రంథం పోలీసు శాఖను కేవలం ఒక ప్రభుత్వ విభాగంగా కాకుండా.. విధి. నిబద్ధత, ప్రజాసేవ, త్యాగాలతో నడిచే వ్యవస్థగా పరిచయం చేస్తుంది. రాత్రీ పగలూ తేడా లేకుండా, ఎండా వానా లెక్క చేయకుండా ప్రజల భద్రత కోసం పనిచేసే పోలీసు జీవితంలోని అనేక కోణాలను రచయిత తన అనుభవంతో ఆవిష్కరించారు. 

పోలీసు వ్యవస్థ ప్రజలకు మరింత చేరువ కావడానికి అవసరమైన మార్పులు, సంస్కరణలపై సూచనలు చేస్తూ సాగిన ఈ గ్రంథం పోలీసు వృత్తిని అర్ధం చేసుకోవాలనుకునే వారికి మాత్రమే కాదు.. సమాజ భద్రత వెనుక పనిచేసే వ్యవస్థను తెలుసుకోవాలనుకునే ప్రతి పాఠకుడికీ ఉపయోగపడే పుస్తకంగా నిలుస్తుంది.

-డా. తంగెళ్ల శ్రీదేవి రెడ్డి–