Nandi Awards 2026: నంది అవార్డులపై ఏపీ సర్కార్ బిగ్ అప్‌డేట్.. విజేతలకు రూ.లక్ష!

Nandi Awards 2026: నంది అవార్డులపై ఏపీ సర్కార్ బిగ్ అప్‌డేట్.. విజేతలకు రూ.లక్ష!

ఏపీలో నంది అవార్డుల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2012 నుంచి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న నంది అవార్డులతో పాటు 2025 అవార్డులను కూడా నిర్వహించేందుకు G.O.Rt.No.1843 జారీ చేసింది. 2017-2024, 2025 సంవత్సరాల అవార్డుల కోసం జ్యూరీ కమిటీలను సెప్టెంబర్‌లో ఏర్పాటు చేయనున్నారు. విజేతల జాబితాను నవంబర్ 2026లో ప్రకటించి, నంది ఫిల్మ్ అవార్డుల వేడుకను డిసెంబర్‌లో అమరావతి/విజయవాడలో, నంది టీవీ అవార్డుల వేడుకను తిరుపతిలో నిర్వహించనున్నారు.

2012-2016 సంవత్సరాలకు సంబంధించిన నంది, జాతీయ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని నవంబర్‌లో విజయవాడలో నిర్వహించనున్నారు. మరోవైపు వచ్చే ఏడాది తెనాలిలో నంది నాటకోత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో చాలాకాలంగా ఎదురుచూస్తున్న నంది అవార్డుల సందడి మళ్లీ మొదలుకానుంది.

టీవీ రంగానికీ నంది పురస్కారాలు

సినీ రంగంతో పాటు టెలివిజన్‌ రంగానికి కూడా నంది అవార్డులను అందించనున్నారు. 2017-2024 కాలానికి ప్రతి ఏడాది మొదటి, రెండో ఉత్తమ మెగా సీరియల్, అలాగే రెండు స్పెషల్ జ్యూరీ అవార్డులను ప్రదానం చేయనున్నారు. 2025 సంవత్సరానికి సంబంధించిన అవార్డులు కూడా ఇదే ప్రక్రియలో భాగం కానున్నాయి. నంది టీవీ అవార్డుల వేడుకను 2026 డిసెంబర్‌లో తిరుపతిలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

నంది నాటకోత్సవాలకు కూడా భారీ ప్లాన్

సినిమా, టీవీతో పాటు తెలుగు నాటక రంగానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. వచ్చే ఏడాది తెనాలి కేంద్రంగా నంది నాటకోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నంది నాటక పురస్కారాలు-2025, కందుకూరి పురస్కారాలు-2026 కోసం ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. కందుకూరి పురస్కారాల కింద నాటక రంగంలోని కళాకారులు, దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులు, నాటక సమాజాలను సత్కరించనున్నారు.

జిల్లాల వారీగా కూడా పురస్కారాలు అందించడంతో పాటు ప్రతిభావంతులకు ప్రత్యేక అవార్డులు ఇవ్వనున్నారు. ఇతర రాష్ట్రాల తెలుగు నాటకాలకు నంది నాటకోత్సవాల్లో ప్రవేశానికి అవకాశం ఉంటుంది. కందుకూరి పురస్కారాల విజేతలకు రూ.లక్ష నగదు కూడా అందించనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్‌ ఇప్పటికే వెల్లడించారు. 

మళ్లీ వెలుగులోకి నంది అవార్డులు

కొంతకాలంగా నంది అవార్డుల నిర్వహణపై ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినీ, టీవీ వర్గాలకు తాజా ప్రభుత్వ ఉత్తర్వులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒకేసారి పలు సంవత్సరాల అవార్డుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం ద్వారా పెండింగ్‌లో ఉన్న నంది అవార్డుల వ్యవహారానికి ముగింపు పలికే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక రాబోయే నెలల్లో జ్యూరీల నియామకం, ఎంపిక ప్రక్రియ, విజేతల ప్రకటనతో నంది అవార్డులపై మరింత ఉత్కంఠ నెలకొనే అవకాశం ఉంది. తెలుగు సినిమా, టీవీ రంగాల ప్రముఖులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరెవరు నంది పురస్కారాలను అందుకోబోతున్నారనే ఆసక్తి ఇప్పుడు మొదలైంది.