Hanuman Ansh Box Office: రూ.2 కోట్లతో తీసిన సినిమా.. రూ.352 కోట్లకు పైగా కలెక్షన్స్.. ‘హనుమాన్ అంశ్’ సక్సెస్ జర్నీ

Hanuman Ansh Box Office: రూ.2 కోట్లతో తీసిన సినిమా.. రూ.352 కోట్లకు పైగా కలెక్షన్స్.. ‘హనుమాన్ అంశ్’ సక్సెస్ జర్నీ

సినిమా హిట్ కావాలంటే భారీ బడ్జెట్.. స్టార్ హీరో.. కోట్లాది రూపాయల ప్రమోషన్స్ అవసరం లేదని మరోసారి ప్రూవ్ చేసింది ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh). కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం షాక్‌కు గురిచేస్తోంది. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ నీమ్ కరోలి బాబా నేపథ్య చిత్రం ఆగస్టు 7న థియేటర్లలోకి వచ్చింది. తొలి రోజు కేవలం రూ.10 లక్షలతో ఓపెన్ అయిన సినిమా.. మొదటి రెండు వారాల్లో పెద్దగా ప్రభావం చూపించలేదు. కానీ ఆ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి, రికార్డ్ స్థాయి వసూళ్లతో టాక్ అఫ్ ది ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది.

ఫస్ట్ 2 వీక్స్.. అంతంత మాత్రమే!

ట్రేడ్ వెబ్ సైట్ సాక్‌నిల్క్‌ డేటా ప్రకారం.. ‘హనుమాన్ అంష్’ తొలి వారంలో రూ.1.08 కోట్లు మాత్రమే వసూలు చేసింది. రెండో వారంలో మరో రూ.40 లక్షలు మాత్రమే వచ్చాయి. అంటే 14 రోజులకు సినిమా ఇండియా నెట్ కలెక్షన్ కేవలం రూ.1.48 కోట్లు. ఇక ఇక్కడి నుంచే అసలు బాక్సాఫీస్ గేమ్ మొదలైంది. రోజురోజుకూ మౌత్ టాక్ పెరుగుతూ.. జనాలు క్యూ కట్టేలా.. థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేలా  చేసింది ‘హనుమాన్ అంశ్’.

ఈ క్రమంలోనే సినిమా మూడో వారంలో ఏకంగా రూ.10.40 కోట్లు రాబట్టింది. ఇక నాలుగో వారంలో (రూ.61కోట్లు), ఐదో వారంలో రూ.90.25కోట్లు), ఆరో వారంలో (రూ.80.25 కోట్ల) కలెక్షన్స్తో రూమ్మురేపింది. అంటే సినిమా విడుదలైన తొలి రెండు వారాల్లో వచ్చిన మొత్తానికంటే ఒక్క 24వ రోజే ఎక్కువ కలెక్షన్ సాధించడం విశేషం.

46 రోజులు.. అయినా తగ్గని జోష్..

సినిమా విడుదలై 46 రోజులు పూర్తయినా ‘హనుమాన్ అంశ్’ జోరు మాత్రం తగ్గలేదు. 46వ రోజు కూడా 7,629 షోల ద్వారా రూ.4.15 కోట్ల ఇండియా నెట్ వసూళ్లు సాధించినట్లు సాక్‌నిల్క్‌ తెలిపింది. దీంతో ఇప్పటివరకు ఇండియా నెట్ కలెక్షన్స్ రూ.276.03 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.325.95 కోట్లుగా నమోదయ్యాయి. ఓవర్సీస్‌లో రూ.26.50 కోట్ల గ్రాస్‌తో కలిపి సినిమా వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.352.45 కోట్లకు చేరుకుంది.

రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.350 కోట్లకు పైగా వసూళ్లు!

ఈ బడ్జెట్ అండ్ వసూళ్ల లెక్కలు చూస్తేనే అర్ధం చేసుకోవొచ్చు.. ‘హనుమాన్ అంశ్’ సక్సెస్ రేంజ్ ఏంటో అని. సుమారు రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ.350 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించడం అంటే.. ప్రస్తుత పరిస్థితిలో సాధారణ విషయం కాదు. ముఖ్యంగా మొదటి రెండు వారాల తర్వాత సినిమా ఒక్కసారిగా పికప్ అవ్వడం, వీక్‌డేస్‌లోనూ స్ట్రాంగ్ కలెక్షన్స్ రావడం ఈ సినిమాను బాక్సాఫీస్ ఫినామినన్‌గా మార్చింది.

ప్రస్తుతం రూ.352 కోట్లకు పైగా వరల్డ్‌వైడ్ గ్రాస్‌తో ‘హనుమాన్ అంష్’ దూసుకెళ్తోంది. చిన్న సినిమా, చిన్న బడ్జెట్ అనే ట్యాగ్‌లను పక్కన పెట్టి.. కంటెంట్ ఉంటే ఆడియన్స్ థియేటర్లకు వస్తారనే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసిన బిగ్ సక్సెస్ స్టోరీగా ఈ సినిమా నిలుస్తోంది. ఇకపోతే, ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు డా. విశాల్ చతుర్వేది ఈ సినిమాను రూపొందించారు. రాగిని ఎస్, నమ్రత. జి. సింగ్, అనుప్రియ ఎ నగర్, డా.విశాల్ చతుర్వేది నిర్మించారు. శోభిత్ శ్రీవాత్సవ, చందన్ ఆనంద్, పూర్ణిమ తివారి, విహాన్ షెగ్డే కీలక పాత్రల్లో నటించారు.

తెలుగులోకి ‘హనుమాన్ అంశ్’..!

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి వసూళ్లు అందుకుంటున్న ‘హనుమాన్ అంశ్’.. తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు డైరెక్టర్ త్రివిక్రమ్. ఆయన సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. అయితే, ఈ నెల 18నే థియేటర్లోకి రావాల్సి ఉండగా.. ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది. త్వరలోనే తెలుగు థియేట్రికల్ రిలీజ్ డేట్ ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది.