వెలుగు ఓపెన్ పేజీ.. పాము కాటుకు అప్రమత్తతే ఆయుధం

వెలుగు ఓపెన్ పేజీ.. పాము కాటుకు అప్రమత్తతే ఆయుధం

మనిషి  ప్రకృతితో  కలిసి జీవిస్తున్నాడు.  కానీ  ప్రకృతి  సమతుల్యత  దెబ్బతింటే అదే  ప్రజాజీవనం ముప్పుకు  కారణమవుతుంది. తెలంగాణలో ప్రస్తుతం మూగజీవుల నుంచి ఎదురవుతున్న ముప్పు అలాంటి పరిస్థితినే ప్రతిబింబిస్తోంది.  వీధికుక్కల దాడులు,  కోతుల బెడద, వర్షాకాలంలో పెరుగుతున్న పాముల సంచారం ప్రజల భద్రతకు సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారుతున్నాయి.  ముఖ్యంగా వర్షాకాలంలో పాములు సురక్షిత ప్రదేశాల కోసం ఇళ్లు, గోదాములు, పశువుల కొట్టాల్లోకి చేరడం సాధారణంగా మారింది.  

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదవుతున్న  పాముకాటు,  కుక్కకాటు కేసులు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి.   గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేక కొందరు నాటు వైద్యాలను ఆశ్రయించడం వల్ల అసలు ప్రమాదం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పాము కాటు  విషయంలో ప్రతి నిమిషం విలువైనదే. సకాలంలో సరైన వైద్యం అందితే ప్రాణాలను కాపాడవచ్చు.  కానీ  మూఢనమ్మకాలతో ఆసుపత్రికి వెళ్లడంలో ఆలస్యం చేయడం ప్రాణాంతకంగా మారుతోంది.

స్నేక్ రెస్క్యూ బృందాలు

సోషల్ మీడియాలో పాములను చేతులతో పట్టడం, వాటిని ప్రదర్శించడం వంటి వీడియోలు విస్తృతంగా కనిపిస్తున్నాయి. వాటిని చూసి కొందరు అదేవిధంగా ప్రయత్నించడం అత్యంత ప్రమాదకరం. వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం పాములు రక్షిత జీవులు. అనుమతి లేకుండా పాములను పట్టడం, బంధించడం, ప్రదర్శించడం చట్టవిరుద్ధం. శిక్షణ పొందిన,  సంబంధిత అనుమతులు కలిగిన స్నేక్ రెస్క్యూ బృందాలు మాత్రమే పాములను సురక్షితంగా రక్షించాలి.  పామును  చంపడం  పరిష్కారం కాదు. పర్యావరణ సమతుల్యతలో పాముల పాత్ర కీలకం.  మూగజీవుల దాడులు,  పాముల సంచారం వంటి ఘటనల్లో భయపడకుండా వెంటనే సంబంధిత శాఖలకు సమాచారం ఇవ్వడం అత్యంత ముఖ్యం.

ప్రజలకు అవగాహనే రక్షణ

కాటు జరిగిన తర్వాత చికిత్స కంటే... కాటు జరగకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యం.  ప్రభుత్వ శాఖలు అత్యవసర  స్పందనకే  పరిమితం కాకుండా ముందస్తు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.  గ్రామీణ ప్రాంతాల్లో  వర్షాకాలం ప్రారంభానికి ముందే  పాముల నివారణపై గ్రామ సభల్లో అవగాహన కల్పించాలి.   రైతులు,  వ్యవసాయ కూలీలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.  పాఠశాలల్లో  పిల్లలకు జంతువుల నుంచి రక్షణపై అవగాహన కల్పించాలి.   

ప్రతి గ్రామంలో  అత్యవసర సంప్రదింపు నంబర్లు అందుబాటులో ఉంచాలి.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందుబాటులో ఉందని విస్తృత ప్రచారం చేయాలి.  అటవీ శాఖ కూడా పాముల రక్షణ, శిక్షణ పొందిన రెస్క్యూ బృందాల ఏర్పాటు, ప్రజల్లో అవగాహన పెంచాలి.  వైద్య ఆరోగ్య శాఖ యాంటీ స్నేక్ వెనం, యాంటీ రేబిస్ టీకాల లభ్యత, అత్యవసర వైద్య సేవల పట్ల అప్రమత్తంగా ఉండాలి.  ప్రజలు ముఖ్యంగా మూఢ నమ్మకాలను విడిచిపెట్టడం,  ప్రమాద సమయంలో వెంటనే వైద్య సహాయం పొందాలి. అవగాహనతో కూడిన 
అప్రమత్తత  ప్రాణాలను కాపాడుతుంది.

అత్యవసర సంప్రదింపు నంబర్లు

 తెలంగాణ అటవీ శాఖ హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్: 1926.  అటవీ, వన్యప్రాణుల అత్యవసర సేవలు:  
1800-–425–5364. 
స్నేక్ రెస్క్యూ సహాయం:  98660 59903.    
కుక్కకాటు, రేబిస్ ప్రమాదం ఎదురైతే: 15400 (రేబిస్ హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్). 
అత్యవసర పరిస్థితుల్లో:  112.

- శ్రీశైలం దూడం
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ 
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.