రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లకు పూర్తి సహకారం: మంత్రులు వివేక్, కోమటిరెడ్డి

రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లకు పూర్తి సహకారం: మంత్రులు వివేక్, కోమటిరెడ్డి
  • మంత్రులు వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి హామీ
  • చిన్న కాంట్రాక్టర్లపై పెనాల్టీల వేధింపులొద్దు
  • రూ. 5 కోట్ల పనికి రూ. 54 కోట్ల పెనాల్టీ వేయడంపై ఆగ్రహం
  • కాంట్రాక్టర్ శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి ఆత్మహత్యపై విచారణకు ఓకే 

హైదరాబాద్, వెలుగు: చిన్న కాంట్రాక్టర్లను మైనింగ్ పెనాల్టీల పేరుతో వేధించొద్దని మంత్రులు వివేక్​ వెంకటస్వామి, కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి అధికారులకు సూచించారు. రూ.5 కోట్ల పనికి రూ.54 కోట్ల భారీ పెనాల్టీలు విధించడం సరికాదని స్పష్టం చేశారు. రోడ్ల నిర్మాణానికి మైనింగ్ శాఖ నుంచి పూర్తి సహకారం అందిస్తామని మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. 

శుక్రవారం సచివాలయంలో మైనింగ్ సమస్యలు, రోడ్ల నిర్మాణ పనులపై ఇరువురు మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ల సమస్యలను అధికారులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లగా..  అక్రమ మైనింగ్ చేసేవారిని వదిలేసి ప్రభుత్వ అభివృద్ధి పనులు చేసే చిన్న కాంట్రాక్టర్లను వేధించడం సరికాదని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. అధికారుల వేధింపుల వల్లే కాంట్రాక్టర్ శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తూ బాధ్యులైన అధికారులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇందుకు స్పందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి.. ప్రతి అంశాన్ని పరిశీలించి తగిన విధంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. 

హ్యామ్​ రోడ్ల నిర్మాణాకి 'గ్రీన్ చానల్ లో నిధులు' 

రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన హ్యామ్​ రోడ్ల నిర్మాణానికి మెటల్, ఇసుక, మట్టి కొరత రాకుండా వేగంగా పర్మిషన్లు ఇచ్చేలా ‘గ్రీన్ చానల్’ ఏర్పాటు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి ఆదేశించారు. 2028 ఆగస్టు నాటికి పనులన్నీ పూర్తి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం 34 ప్యాకేజీలుగా చేపడుతున్న హ్యామ్​ రోడ్లకు కంకర, మట్టి, ఇసుక పెద్ద మొత్తంలో అత్యవసరమని, వీటి సరఫరాలో ఆలస్యం జరిగితే పనులు నిలిచిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మెటల్ అనుమతుల విషయంలో కాంట్రాక్టర్లను అనవసరంగా ఇబ్బందులకు గురిచేయకుండా వేగంగా అనుమతులు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. 

మైనింగ్​ సమస్యలు ఆటంకంగా మారొద్దు

మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సానుకూలంగా స్పందిస్తూ.. రాష్ట్రంలో చేపడుతున్న భారీ రహదారుల నిర్మాణానికి మైనింగ్ సమస్యలు ఏమాత్రం ఆటంకంగా మారకూడదని అధికారులకు సూచించారు. హ్యామ్​ రోడ్ల నిర్మాణం వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు, జిల్లా కేంద్రాలకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడి రాష్ట్ర ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుందని మంత్రులిద్దరూ అభిప్రాయపడ్డారు. 

కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను నిబంధనల పరిధిలో క్షుణ్ణంగా పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని మైనింగ్ శాఖ అధికారులను మంత్రి వివేక్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దామోదర్‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, టీజీఎండీసీ  ఎండీ అనుదీప్ దురిశెట్టి, ఆర్​ అండ్​ బీ చీఫ్ ఇంజనీర్ బి.వి.రావులతో పాటు అధికారులు పాల్గొన్నారు.