బ్యాంక్ యూనియన్ల సమ్మె, వారాంతపు సెలవులు కలిసిరావడంతో వరుసగా 5 రోజులపాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తలపెట్టిన 3 రోజుల సమ్మె, ముందురోజులైన శనివారం, ఆదివారం సెలవులతో కలిపి మొత్తం 5 రోజులు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. ప్రభుత్వ రంగ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆదివారం అంటే సెప్టెంబర్ 27, 2026 న పూర్తిస్థాయిలో సేవలను అందించేందుకు ఓపెన్ చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
యూనియన్ల సమ్మె కారణంగా ప్రజల బ్యాంకింగ్ అవసరాలకు ఎలాంటి అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ముందస్తు చర్యలు చేపట్టింది. RBI ఆమోదంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంక్ శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం-లింక్డ్ బ్రాంచ్‌లు, కరెన్సీ చెస్ట్‌లు సెప్టెంబర్ 27న సాధారణ రోజుల్లో మాదిరిగానే సేవలు అందించనున్నాయి. ఇదే క్రమంలో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వం, బ్యాంక్ యాజమాన్యాలు యూనియన్లకు విజ్ఞప్తి చేశాయి. డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన సయోధ్య సమావేశం విఫలం కావడంతో.. బ్యాంకింగ్ ఉద్యోగుల సంఘాల వేదికైన UFBU సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది.
బ్యాంకింగ్ ఉద్యోగుల్లో 90 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెబుతున్న UFBU, ప్రధానంగా 5 రోజుల బ్యాంకింగ్ విధానం డిమాండ్‌తో ఈ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 30వ తేదీన బ్యాంకుల హాఫ్ ఇయర్లీ క్లోజింగ్ కూడా ఉండటంతో ఈ సమ్మె మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ తేదీ ట్రెజరీ నిర్వహణ, మార్కెట్ ఆపరేషన్స్, రీకన్సిలియేషన్ వంటి కీలక ప్రక్రియలకు చాలా ముఖ్యమైనది. సమ్మె జరిగితే ఈ ఆర్థిక లావాదేవీలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.
ALSO READ : జీ అధినేత సుభాష్ చంద్రకు ఎదురుదెబ్బ
ఈ వరుస సెలవులు, సమ్మె నేపథ్యంలో ఖాతాదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. వినియోగదారులు అత్యవసర బ్యాంకింగ్ సేవల కోసం UPI, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంలు, బీసీ పాయింట్ల వంటి డిజిటల్ ఛానెల్‌లను ఉపయోగించుకోవాలని సూచించాయి. ఖాతాదారులు ఈ ఐదు రోజుల సమ్మె కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందే తమ ఆర్థిక లావాదేవీలను ప్లాన్ చేసుకోవడం బెటర్. అయితే కొత్తగా ఇప్పుడు ఆదివారం బ్యాంకులు ఓపెన్ చేయటం కొంత ఊరటను ఇవ్వనుంది.
