పెండింగ్ జీతం ఇవ్వలేదని యజమానిపై కక్ష: రూ. 24 కోట్ల సరుకు తగలబెట్టిన అకౌంటెంట్

పెండింగ్ జీతం ఇవ్వలేదని యజమానిపై కక్ష: రూ. 24 కోట్ల సరుకు తగలబెట్టిన అకౌంటెంట్

గుజరాత్‌లోని సూరత్‌లో రూ.10 వేల పెండింగ్ జీతం కోసం జరిగిన ఓ వివాదం పెద్ద అగ్నిప్రమాదానికి దారితీసింది. షాపు యజమాని తన పెండింగ్ జీతం రూ.10వేలు ఇవ్వకపోగా, తనను తీవ్రంగా అవమానించాడన్న కక్షతో ఒక మాజీ అకౌంటెంట్ చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సూరత్‌లోని శ్యామ్ సంగిని టెక్స్‌టైల్ మార్కెట్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పోలీసుల విచారణలో నిందితుడు వెల్లడించిన వివరాల ప్రకారం.. సదరు వ్యక్తి గతంలో ఆ మార్కెట్‌లోని ఒక టెక్స్‌టైల్ దుకాణంలో అకౌంటెంట్‌గా పని చేసి మానేశాడు. అయితే అతనికి రావాల్సిన చివరి నెల జీతంలో రూ.10వేలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ డబ్బుల కోసం అడిగినప్పుడు యజమానులు సరిగా స్పందించకపోగా.. తన పనితీరును కించపరుస్తూ అవమానించారని నిందితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో యజమానులకు తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల విచారణలో చెప్పాడు.   

ALSO READ : లంచ్‌బాక్స్‌లో మెంతి కూర తెచ్చినందుకు రూ.50 జరిమానా !

దీనికోసం నిందితుడు పక్కా ప్లాన్ వేసి కేవలం రూ.150తో పెట్రోల్ కొన్నాడు. రాత్రి సమయంలో మార్కెట్ మూసివేసిన తర్వాత అక్కడికి చేరుకుని, షాప్ బయట డెలివరీ కోసం సిద్ధంగా ఉంచిన బట్టల పార్శిళ్లపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. క్షణాల్లో మంటలు చెలరేగి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కేవలం నిందితుడు పనిచేసిన యజమాని షాప్ మాత్రమే కాకుండా.. పక్కనే ఉన్న మరో 11 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మొత్తంగా సుమారు రూ.24 కోట్ల విలువైన వస్త్రాలు, విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి.   

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన సూరత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత భయపడి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాలకు పరారైన నిందితుడు, డబ్బులు అయిపోవడంతో సూరత్‌కు తిరిగొచ్చేయటంతో పోలీసులకు చిక్కాడు. కేవలం పది వేల రూపాయల జీతాల వివాదం కోట్ల రూపాయల ఆస్తులను బూడిద పాలు మార్చడం పట్ల నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.