ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఐదుగురు పసికందులు మృతి చెందిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. పలు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా మానవ హక్కుల కమిషన్ ఈ ఉదంతాన్ని సుమోటోగా స్వీకరించింది. కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఈ వ్యవహారంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ... తెలంగాణ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి కీలక ఆదేశాలు జారీ చేశారు.
సెప్టెంబర్ 21న అర్ధరాత్రి సమయంలో... ఎస్‌ఎన్‌సీయూలోని ఏసీ యూనిట్ వద్ద జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ నవజాత శిశువుల వార్డును కమ్మేసింది. ఆ సమయంలో అక్కడ చికిత్స పొందుతున్న సుమారు 27 మంది పసికందులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. ఈ ప్రమాదంలో ఐదుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోగా... మరికొందరు తీవ్రమైన పొగ కారణంగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. అప్రమత్తమైన సిబ్బంది వారిని వెంటనే ఇతర వార్డులకు, సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు.
అయితే, ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రిలో అగ్నిప్రమాద హెచ్చరిక వ్యవస్థలు లేవా? అగ్నిమాపక పరికరాలు పనిచేస్తున్నాయా? అత్యవసర సమయాల్లో శిశువులను తరలించేందుకు తగిన ఏర్పాట్లు లేవా? విద్యుత్, ఏసీ వ్యవస్థల నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందా? అనే ప్రశ్నలకు సమాధానాలు రావలసి ఉంది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లు, సహాయక చర్యలు, బాధితులకు అందిన వైద్యంపై సమగ్ర విచారణ జరిపి... పూర్తి నివేదికను అక్టోబర్ 27 లోగా సమర్పించాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని మానవ హక్కుల కమిషన్ స్పష్టంగా ఆదేశించింది.
