రాధ చేతిలో నేనే మోసపోయా.. సోదరిపై నటి అంబిక సంచలన ఆరోపణలు!

రాధ చేతిలో నేనే మోసపోయా.. సోదరిపై నటి అంబిక సంచలన ఆరోపణలు!

ఒక్కప్పుడు దక్షిణాది వెండితెరపై మైమరిపించిన కథానాయికలు, తోడబుట్టిన అక్కాచెల్లెళ్లు రాధ, అంబిక. అయితే వీరి మధ్య నెలకొన్న రూ. కోట్ల ఆస్తి తగాదా ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ డ్రీమ్ సిస్టర్స్ మధ్య రూ. 50 కోట్ల ఖాళీ చెక్కుల దొంగతనం వ్యవహారం వీధికి ఎక్కడంతో వివాదం పీక్‌కు చేరింది.

తన ఇంట్లో ఉన్న ఖాళీ సంతకం చెక్కులను దొంగిలించి, దాదాపు రూ. 46 కోట్ల వరకు కాజేసేందుకు ప్రయత్నించారంటూ అక్క అంబిక, సోదరుడు మల్లిఖార్జున్‌లపై రాధ చెన్నై పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్‌లో బ్యాంకు నుంచి వచ్చిన అలర్ట్ ఆధారంగా ఈ మోసాన్ని గుర్తించి, పేమెంట్‌ను నిలిపివేసినట్లు ఆమె తెలిపారు.

రాధ ఆరోపణలపై అంబిక అంతే ఘాటుగా స్పందించారు. మీడియా ముందట తీవ్ర ఉద్వేగానికి లోనవుతూ .. అసలు మోసపోయింది నేనే. కష్టపడి సంపాదించిన ఆస్తులను దోచుకుని, ఇప్పుడు నాపైనే దొంగతనం నిందలు వేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంజీఆర్ ఆశీస్సులతో, తన రెక్కల కష్టంతో నిర్మించిన 'ARS గార్డెన్ స్టూడియో' పేరును తనకు తెలియకుండా 'RR గార్డెన్'గా మార్చి అమ్మేసేందుకు కుట్రలు పన్నుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ALSO READ ": బాలీవుడ్‌ హీరోయిన్స్‌ను తొక్కేసిన సౌత్ భామలు.. 

చెక్కులు దొంగిలించినవి కావని, ఆస్తి సెటిల్‌మెంట్‌లో భాగంగానే రాధ మేనేజర్ ఇచ్చారని  అంబిక స్పష్టం చేసింది. రాధే తనకు రూ. 97 కోట్లు బాకీ పడిందని మరో సంచలన ఆరోపణ చేశారు. మధురవాయల్‌లోని 50 సెంట్ల స్థలంతో పాటు, బిజినెస్ షేర్లను దక్కకుండా చేశారని మండిపడ్డారు. ఈ వ్యవహారం ఇప్పటికే మద్రాస్ హైకోర్టు ఆర్బిట్రేషన్, సివిల్ సూట్ పరిధిలో ఉందని గుర్తుచేశారు..

సొంత చెల్లెలే ఇలాంటి నిందలు వేయడం వెనుక ఎవరో మూడో వ్యక్తి తప్పుడు సలహాలు ఉన్నాయని అంబిక ఆరోపించారు. ఇప్పుడు సినీ ప్రపంచమంతా డబ్బు చుట్టూనే తిరుగుతోందని విచారం వ్యక్తం చేశారు. ఒకప్పటి ఈ అగ్ర కథానాయికల కోర్టు పోరాటం, ఆరోపణల పర్వం సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతోంది..