ఒరాకిల్ లేఆఫ్స్‌లో షాకింగ్ నిజాలు: ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఎక్కువగా 40 ఏళ్లు దాటినవారే!

ఒరాకిల్ లేఆఫ్స్‌లో షాకింగ్ నిజాలు: ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఎక్కువగా 40 ఏళ్లు దాటినవారే!

అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ చేపట్టిన లేఆఫ్‌లకు సంబంధించి బయటికి వచ్చిన అంతర్గత డాక్యుమెంట్లు సంచలన విషయాలను వెల్లడించాయి. ముఖ్యంగా ఒరాకిల్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో వయోపరిమితి, ఉద్యోగ హోదాలకు సంబంధించిన వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాలోని ఈ విభాగంలో తొలగించిన 546 మంది ఉద్యోగుల వయసు, జాబ్ టైటిల్స్‌తో కూడిన లిస్ట్ బిజినెస్ ఇన్‌సైడర్ రిపోర్ట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇది ఆ సంస్థ క్లౌడ్ డిపార్ట్‌మెంట్‌లోని మొత్తం 7వేల 185 మంది ఉద్యోగులలో దాదాపు 7.6 శాతంగా ఉంది.

ఈసారి లేఆఫ్స్ లో అత్యధికంగా 40 ఏళ్లకు పైబడినవారినే కంపెనీ టార్గెట్ చేసినట్లు వెల్లడైంది. ఇందులో దాదాపు 16 శాతం మంది ఉద్యోగులు 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు వారేనట. AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై భారీగా పెట్టుబడులు పెడుతున్న ఒరాకిల్.. సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, ఇంజనీర్లు, మేనేజర్లు, డేటా సెంటర్ సపోర్ట్ సర్వీసెస్‌లో పనిచేస్తున్న సిబ్బందిని పీకేస్తోంది. వయసు ఆధారిత వివక్ష చట్టాలకు అనుగుణంగానే ఈ డేటాను సేకరించినట్లు కంపెనీ తెలిపింది.

సాఫ్ట్‌వేర్ డెవలపర్లు ఈ లేఆఫ్‌లలో సుమారు 17 శాతం వరకు నష్టపోయారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ డెవలపర్ III రోల్స్ అత్యధికంగా ప్రభావితం కాగా.. ఆ తర్వాత ప్రోగ్రామ్ మేనేజర్ IV, ప్రిన్సిపాల్ కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. అలాగే డేటా-సెంటర్ సపోర్ట్ సర్వీసెస్ డివిజన్‌లో వైస్ ప్రెసిడెంట్, ఇద్దరు సీనియర్ డైరెక్టర్లతో సహా 41 మంది ఉద్యోగులను తొలగించారు. లిస్టులో మేనేజర్ అనే పదం ఉన్న రోల్స్ 128 వరకు ఉండటం, ఇది మొత్తం తొలగింపుల్లో 23 శాతంగా నిలవడం ఉద్యోగులను విస్మయానికి గురిచేసింది.

AI విస్తరణలో భాగంగా ఒరాకిల్ కొత్త డేటా సెంటర్ల నిర్మాణం కోసం ఈ ఏడాది 90 బిలియన్ డాలర్ల నుంచి 95 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాలని భావిస్తోంది. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగం త్రైమాసిక రాబడి భారీగా వృద్ధి చెందుతున్నప్పటికీ.. కంపెనీ మాత్రం అంతర్గతంగా పునర్నిర్మాణ చర్యల పేరుతో ఉద్యోగుల తొలగింపును కొనసాగిస్తోంది. మే 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలోనే ఒరాకిల్ తన ఉద్యోగుల సంఖ్యను సుమారు 21 వేల వరకు తగ్గించుకోవటం చూస్తుంటే లేఆఫ్స్ ఏ స్థాయిలో జరిగాయో అర్థం అవుతోంది.