అధికారం అనేది ఒక బాధ్యత, అది అహంకారం కాదు. అధికార గర్వంతో కళ్లు మూసుకుపోతే, వేగంగా పతనమవుతారు అని పెద్దలు చెప్పిన సూక్తులు ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సరిగ్గా అన్వయిస్తాయి. అధికారమనేది శాశ్వతం కాదని చరిత్ర చెబుతున్నా... అధికారమే పరమావధి అనే ఏకైక లక్ష్యంతో నియంతృత్వంగా పాలిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతున్నారు. దేశంలో విద్యారంగం నిర్వీర్యంపై విద్యార్థులు మోదీ ప్రభుత్వం మెడలు వంచడం, అనంతరం జరిగిన పలు ఉప ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు ఎదురవడం దేశ రాజకీయాల్లో సంభవించబోతున్న మార్పులను స్పష్టంగా సూచిస్తున్నాయి. ఆరు నెలల్లో జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీకి ఇక పరాజయం తప్పదనే సంకేతాలు ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్రోద్యమంలో చేపట్టిన ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలాగ రాబోయే రోజుల్లో ‘క్విట్ బీజేపీ’ దిశగా దేశంలో అడుగులు పడుతున్నట్టు ప్రస్తుత రాజకీయ సమీకరణాలు కనిపిస్తున్నాయి.
‘ఛాత్రోం కీ గూంజ్’ దేశ యువతకు మద్దతుగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు
ప్రధానమంత్రి నివాసం వద్ద నిరసన చేపట్టడం దేశ రాజకీయాల్లో కీలక పరిణామం. పార్లమెంట్ వేదికగా, దేశవ్యాప్తంగా ‘ఛాత్రోం కీ గూంజ్’ పేరిట కాంగ్రెస్ చేపట్టిన నిరసనలకు తోడు విద్యార్థుల ఉద్యమానికి తలొగ్గిన మోదీ ప్రభుత్వం మొండిపట్టును వీడి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించడం ప్రజాస్వామ్యానికి దక్కిన గొప్ప విజయం. ఈ ఉద్యమం అనంతరం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన మూడు శాసనసభ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ రెండుచోట్ల ఓడిపోవడం వారి నియంతృత్వ పోకడలను ప్రజలు తిరస్కరిస్తున్నారని పూర్తిగా స్పష్టమవుతోంది.
జులై నెలలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసన జ్వాలలు.. జులై నెల చివరిలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమితో స్పష్టంగా ప్రస్ఫుటమయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో తమకు తిరుగులేదని భావిస్తున్న బీజేపీకి బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పరాజయం భవిష్యత్తులో వారి పతనానికి నాంది.
బంకీపూర్‌లో బీజేపీ ఓటమి చారిత్రాత్మకం
బిహార్‌లోని బంకీపూర్‌లో బీజేపీ ఓటమి చారిత్రాత్మకం. ఇక్కడ మూడు దశాబ్దాలుగా బీజేపీ ఓటమి ఎరుగదు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రాతినిధ్యం వహించిన బంకీపూర్‌లో ఆయన రాజీనామా చేయడంతో అనివార్యమైన ఉప ఎన్నికల్లో ఓడిపోవడం బీజేపీపై వ్యతిరేకతకు నిదర్శనం. మధ్యప్రదేశ్‌లోని దాతియా అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఆ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో అక్కడి బీజేపీ ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం స్పష్టమవుతోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో ప్రత్యేకించి యువతలో తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందని ఈ ఫలితాలు రూఢీ చేస్తున్నాయి. బీజేపీ నిరంకుశత్వాన్ని ఎండగడుతున్న రాహుల్ గాంధీని ప్రజలు ఆదరిస్తున్నారని మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలుపు నిరూపిస్తోంది. మూడు దఫాలు వరుసగా అధికారం చేపట్టిన 12 ఏండ్ల మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర నిరాశ నిస్పృహలు పెరిగిపోతున్నాయని చెప్పడానికి నిదర్శనమే విద్యార్థుల ఉద్యమం, ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమి. బీజేపీ రాజ్యాంగానికి తూట్లుపొడుస్తూ ప్రజాస్వామ్యం లక్ష్యాలను నీరుగారుస్తూ ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేసింది. స్వయంప్రతిపత్తి గల ఈడీ, ఐటీ, సీబీఐ, ఎన్నికల సంఘం వంటి సంస్థలను అధికార ఒత్తిడితో భ్రష్టు పట్టిస్తోంది.
ప్రతిపక్ష నేతలే లక్ష్యం
ప్రభుత్వ లోపాలను ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకొని ఈడీ, ఐటీ, సీబీఐల చేత దాడులు చేయించడం పరిపాటిగా మారింది. ప్రపంచంలో ఎంతో పేరు, ప్రతిష్టలున్న భారత ఎన్నికల సంఘాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కింది. ఓట్ చోరీతో, ‘సర్’ ప్రక్రియతో తమ వ్యతిరేక వర్గ ఓట్లను తొలగించడంతోనే బీజేపీ గెలుస్తుందనే వాదనలున్నాయి.
ఈ అవకతవకలను రుజువులతో రాహుల్ గాంధీ పలు వేదికలపై ఎండగట్టి బీజేపీ నిజస్వరూపాన్ని బహిర్గతం చేశారు. బీజేపీ ఎంతకు దిగజారిందంటే మధ్యప్రదేశ్ నుండి కాంగ్రెస్ తరఫున రాజ్యసభ ఎంపీగా సునాయాసంగా విజయం సాధించాల్సిన మీనాక్షి నటరాజన్ గెలుపును అక్రమాలతో అడ్డుకుంది. అందుకే మధ్యప్రదేశ్ ప్రజలు దాతియా ఉప ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పారు.
భారత రాజ్యాంగంలో పలు మార్పులు చేయడానికి బీజేపీ పన్నుతున్న కుట్రలను కాంగ్రెస్ ఎప్పటికప్పుడు అడ్డుకుంది. రాజ్యాంగ రూపకర్త, బడుగు, బలహీన వర్గాల పెన్నిధి డా. బీఆర్. అంబేద్కర్‌ను పార్లమెంట్ వేదికగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అవమానించి తమ మనువాద భక్తిని చాటుకున్నారు. రాముడిని తమ పేటెంట్‌గా భావిస్తూ ప్రకటనలు చేసే బీజేపీ విరాళాల అవకతవకలపై నోరు మెదపడం లేదు.
బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి దోస్తి
బీజేపీ నియంతృత్వ పోకడలపై దేశవ్యాప్తంగా తిరుగుబాటు కన్పిస్తుంటే తెలంగాణలో బీఆర్ఎస్ భిన్నంగా స్పందిస్తోంది. విద్యార్థులకు మద్దతిస్తున్నట్టు ఆ పార్టీ నేతలు బహిరంగంగా కపట ప్రకటనలు చేస్తూ కేంద్రంలోని బీజేపీతో లోపాయికారిగా అవగాహనతో ఉన్నారు. రెండేళ్లలో రికార్డు స్థాయిలో 70వేల ఉద్యోగాలిచ్చిన కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారు. జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయం జరగాలనే ఆకాంక్షతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపితే అక్కడ ఉద్ధేశ పూర్వకంగా బీజేపీ ప్రభుత్వం అడ్డుకుందనేది బహిరంగ రహస్యమే.
ప్రజాభిమానాన్ని పొందాల్సిన ప్రభుత్వాలు నియంతృత్వ పోకడలు ప్రదర్శిస్తే ప్రజలు తిరస్కరిస్తారని పలు సందర్భాలలో ఇప్పటికే నిరూపితమైంది. ఆంగ్లేయులు ప్రజలపై కొనసాగించిన దమనకాండను నిరసిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం దేశాన్ని వీడాలని డిమాండ్ చేస్తూ 1942 ఆగస్టు 8న మహాత్మా గాంధీ ‘క్విట్ ఇండియా’ ఉద్యమానికి పిలుపివ్వగా ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో ప్రస్తుతం దేశంలో నియంతృత్వ పాలన సాగిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ‘క్విట్ బీజేపీ’ అంటూ ప్రజాస్వామ్యవాదులు చైతన్యం కావాల్సిన ఆవశ్యకత ఉంది.
- బి.మహేశ్ కుమార్ గౌడ్,ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
