iPhone 18 Pro యూజర్ల కష్టాలు.. లక్షలు పెట్టి కొంటే ఫేస్ ఐడీ పనిచేయట్లే, సడెన్‌గా రీబూట్!

iPhone 18 Pro యూజర్ల కష్టాలు.. లక్షలు పెట్టి కొంటే ఫేస్ ఐడీ పనిచేయట్లే, సడెన్‌గా రీబూట్!

ఆపిల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన కొత్త ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ మోడల్స్ మార్కెట్లోకి వచ్చీరావడంతోనే టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి. కొత్త ఫోన్లను ఎంతో ఉత్సాహంగా కొన్న యూజర్లకు ప్రారంభంలోనే ఊహించని షాక్ తగిలింది. ఫోన్‌లోని అత్యంత కీలకమైన సెక్యూరిటీ ఫీచర్ అయిన 'ఫేస్ ఐడీ' ఆథెంటికేషన్ సరిగ్గా పనిచేయక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఐఫోన్ లవర్స్. 

ఫేస్ ఐడీ ఫెయిల్..
ఐఫోన్ 18 ప్రో మోడల్స్‌లో ఫేస్ ఐడీ ఫెయిల్ అవుతున్నట్లు చాలా మంది యూజర్లు రిపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా పాస్‌వర్డ్స్ యాప్, సఫారి ప్రైవేట్ ట్యాబ్స్ వంటి బయోమెట్రిక్ లాక్ వేసిన యాప్స్‌ను అన్‌లాక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఫేస్ ఐడీ ఫెయిల్ అవుతోందట. ఆ సమయంలో ఫోన్ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయి.. ఆ తర్వాత దానంతట అదే రీబూట్ అయి లాక్ స్క్రీన్‌కు వెళుతున్నట్లు యూజర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సెటప్ సమయంలోనూ ఎర్రర్స్..
కేవలం యాప్స్ అన్‌లాక్ చేయడమే కాకుండా.. కొత్త ఫోన్ సెటప్ చేసే సమయంలోనూ కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయట ఐఫోన్ యూజర్లకు. ఫేస్ ఐడీని సెట్ చేసుకునే ప్రయత్నంలో యూజర్లకు "ఫేస్ ఐడీ ఈజ్ నాట్ అవైలబుల్" అనే అలర్ట్ మెసేజ్‌లు వస్తున్నట్లు ఫోరమ్‌లలో చర్చనడుస్తోంది. అంతేకాకుండా ఫోన్‌లో "రిక్వైర్ అటెన్షన్ ఫేస్ ఐడీ" ఆప్షన్‌ను ఆన్ చేసినప్పటికీ.. ఫోన్ ఆ నిబంధనను సరిగ్గా పాటించడం లేదనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి.

కొత్త హార్డ్‌వేర్ మార్పులే కారణమా?
లక్షలు పోసి కొన్న కొత్త ఐఫోన్ 18 ప్రో మోడల్స్‌లో ఆపిల్ సంస్థ ఫేస్ ఐడీ హార్డ్‌వేర్‌లో కీలక మార్పులు చేసింది. డైనమిక్ ఐలాండ్‌ను మరింత చిన్నదిగా మార్చాలనే ఉద్దేశంతో.. ఇన్‌ఫ్రారెడ్ కెమెరాను డిస్‌ప్లే కింద, ఎడమ వైపు మూలన అమర్చింది. ఈ హార్డ్‌వేర్ మార్పు కారణంగానే ఫేస్ ఐడీ రికగ్నిషన్‌లో సమస్యలు వస్తున్నాయా లేక ఇది కేవలం సాఫ్ట్‌వేర్ లోపమా అనేది ఇంకా తేలాల్సి ఉందని టెక్ నిపుణులు అంటున్నారు. అయితే త్వరలోనే ఆపిల్ సంస్థ రాబోయే iOS 27 అప్‌డేట్ ద్వారా ఈ బగ్‌లను పరిష్కరించే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.