స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిల నుంచి పడిపోకుండా కేవలం ఒకే చోట స్థిరంగా ఉండిపోవడాన్ని ‘టైమ్ కరెక్షన్’ అంటారు. సరిగ్గా ఇదే పరిస్థితిని గత 2 ఏళ్లుగా భారతీయ ఈక్విటీ మార్కెట్లు ఎదుర్కొంటున్నాయి. సెప్టెంబర్ 26, 2024న బీఎస్ఈ సెన్సెక్స్ తాకిన గరిష్ట స్థాయి నుంచి సుమారు 725 రోజులు గడిచినా.. సూచీలు ఇప్పటికీ కొత్త రికార్డులను తాకలేకపోయాయి. 2012 తర్వాత సెన్సెక్స్ ఈ స్థాయిలో సుదీర్థ కాలం పాటు రికార్డు గరిష్టాన్ని తాకకపోవడం ఇదే మొదటిసారి. 2026లో ఏకంగా 38% ట్రేడింగ్ రోజులు నెగెటివ్ రిటర్న్‌లను నమోదు చేశాయి. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు ఆందోళన చెందాలా లేక ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి..
గత చరిత్ర ఏం చెబుతోంది?
మార్కెట్లు ఇలా స్థబ్దంగా, కింద పడిపోయి ఉండటం కొత్తేమీ కాదు. 2008 నాటి గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ సమయంలో సెన్సెక్స్ దాదాపు 61% పడిపోగా, కోలుకోవడానికి 3 ఏళ్ల సమయం పట్టింది. అలాగే 1994, 2000 డాట్-కామ్ బబుల్ కాలంలోనూ మార్కెట్లు దాదాపు 4 నుంచి 5 సంవత్సరాల పాటు ఎలాంటి లాభాలను అందించలేదు. అయితే గత సంక్షోభాలకు భిన్నంగా.. ప్రస్తుత పరిస్థితి ఒక బ్యాలెన్స్ షీట్ సంక్షోభం కాదని, ఇది కేవలం వాల్యుయేషన్, సమయంతో కూడిన కరెక్షన్ అని నిపుణులు వివరిస్తున్నారు.
మారుతున్న మార్కెట్ పరిస్థితి..
ఇండెక్స్ స్థాయిలో రెండేళ్లుగా లాభాలు లేకపోయినా.. దేశ ఆర్థిక వ్యవస్థ(GDP), కంపెనీల ఆదాయాలు పెరుగుతూనే ఉన్నాయి. ఫారెక్స్ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మకాలు జరపడం వల్ల లార్జ్ క్యాప్ ఇండెక్స్‌లు నెమ్మదించినప్పటికీ, దేశీయ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ల సపోర్ట్ తో మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ నిలదొక్కుకున్నాయి. కాలం గడుస్తున్న కొద్దీ కంపెనీల విలువ మెరుగవుతోందని, ఇది భవిష్యత్‌లో మెరుగైన రిటర్న్‌లకు బాటలు వేస్తుందని నిపుణులు అంటున్నారు.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి? - అమ్మాలా? హోల్డ్ చేయాలా?
ఇలాంటి సమయంలో భయపడి స్టాక్‌లను అమ్మేయడం సరైన నిర్ణయం కాదు. రూపాయి కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనం పొందడానికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ బెస్ట్ మార్గం. గత చరిత్ర ప్రకారం.. సుదీర్ఘ కాలంలో ఎస్‌ఐపీలు ఎప్పుడూ మంచి లాభాలనే అందించాయి. కాబట్టి ఎస్‌ఐపీలను కొనసాగించాలని నిపుణులు చెబుతున్నారు.
ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే బదులు, సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ ద్వారా విడతలవారీగా ఇన్వెస్ట్మెంట్ సేఫ్. మార్కెట్ స్వల్పకాలిక హెచ్చుతగ్గులను పట్టించుకోకుండా, మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల ఆధారంగా పోర్ట్‌ఫోలియోను బ్యాలెన్స్ చేసుకోవాలి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితి ఇన్వెస్టర్ల సహనానికి అసలైన పరీక్ష. ఓపికతో వేచి ఉండి, క్వాలిటీ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమశిక్షణతో పెట్టుబడులు కొనసాగించే వారికే భవిష్యత్‌లో బలమైన లాభాలు దక్కుతాయి.
