ఉద్ధవుడు శ్రీకృష్ణుని ప్రియ మిత్రుడు. శ్రీకృష్ణుడు తన దేహం విడిచిపోయే ముందు ఉద్దవుడితో చెప్పిన మాటలు ఎంతో విలువైనవి. "ఉద్దవా! నీవు నా ప్రియ మిత్రుడివి, సహృదయుడవి. నీకు ఓ రహస్యం చెప్తాను. విను..
సత్సంగమనేది లోకంలో అన్ని ఆసక్తులనూ నశింపచేస్తుంది. యోగం. తపస్సు, సన్యాసం, యజ్ఞం, వైదిక కర్మలు, వ్రతాలు, పూజలు, మంత్రాలు, తీర్థయాత్రలు చేయడం కంటే కూడా నేను సత్సాంగత్యానికే తొందరగా వశమవుతాను.
ఇలా కేవలం సత్సాంగత్యం వల్ల గోపికలు, గోవులు, బృందావనంలోని చెట్లు చేమలు, లతలు నన్ను పొందగలిగాయి' అంటాడు. దీన్ని కేవలం ఉద్దవుడికే కాదు.. ఈ లోకం మొత్తానికి సూచించాడు.
పైకి కనపడే ఈ ప్రపంచమంతా అసత్. లౌకిక విషయాలన్నీ బాధ కలిగిస్తాయి. చావు - పుట్టుకలు లేనిది. సత్యమైనది. నిత్యమైనదే సత్. అది మన లోపల, మన హృదయంలో దాగుంది. అదే పరమానందం.. అదే పరమాత్మ!
అందుకే అన్ని భూతాలలో నేనున్నానని శ్రీకృష్ణుడు చెప్తాడు. ఎవరైతే మనల్ని బయటికి పరుగులు తీయమని చెప్పకుండా, అంతర్ముఖులై అంతర్యామిని కలుసుకోమని చెప్తారో వాళ్లే సత్పురుషులు. వాళ్ల సాంగత్యమే సత్ సాంగత్యం.
ALSO READ : కుంభరాశిలో అద్భుతం.. రాహువు .. చంద్రుడు కలయిక .. గ్రహణ యోగం..
గోపికలకు, చెట్లకు, చేమలకు కృష్ణుని స్పర్శ లభించింది. ఆ అదృష్టం మనకు లేదే అని నిరాశపడక్కర్లేదు. ఆయన నిత్యమై, సత్యమై మన హృదయంలోనే ఉన్నాడు. చేరుకోవడమే ఆలస్యం!
