మహాభారత యోధుడిగా రాఘవ లారెన్స్.. 'మహావీర్ కర్ణ' ఫస్ట్ లుక్ తో సోషల్ మీడియా షేక్!

మహాభారత యోధుడిగా రాఘవ లారెన్స్.. 'మహావీర్ కర్ణ' ఫస్ట్ లుక్ తో సోషల్ మీడియా షేక్!

భారతీయ సినీ చరిత్రలోనే ముందెన్నడూ చూడని రీతిలో ఒక విజువల్ వండర్ తెరకెక్కుతోంది. మహాభారతంలోని అత్యంత ధీరోదాత్త పాత్ర అయిన 'కర్ణుడి' గాధను వెండితెరపై మైండ్ బ్లాకింగ్ విజువల్ వండర్‌గా ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్. ఈ మైథలాజికల్ లైవ్-యాక్షన్ విజువల్ స్పెక్టాకిల్ చిత్రం 'మహావీర్ కర్ణ'.  లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి లారెన్స్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే లారెన్స్ లోని అసలైన రౌద్రం బయటకొచ్చినట్లు స్పష్టమవుతోంది. భగభగ మండే కళ్ళు, నుదిటిపై సూర్య భగవానుడి దైవిక సూర్య తిలకంతో లారెన్స్ నయా లుక్ అదరగొడుతోంది. పొడవైన ఒత్తైన జుట్టు, ఎడమ కంటి కింద చిన్న గాయం, ఒంటిపై దివ్య శక్తిని ప్రతిబింబించే అత్యంత శోభాయమానమైన బంగారు కవచం, మెరిసే చెవుల కుండలాలు కర్ణుడి దివ్యత్వాన్ని పెంచాయి. ఈ క్యారెక్టర్ కోసం లారెన్స్ మునుపెన్నడూ లేని విధంగా మేకోవర్ అయ్యి, తొలిసారిగా ఒక పూర్తిస్థాయి పౌరాణిక పాత్రలో అడుగుపెడుతున్నాడు.

ఈ సినిమా సాధారణ పౌరాణిక చిత్రం కాదంటున్నారు మేకర్స్. సుమారు రూ.1550 కోట్ల భారీ బడ్జెట్‌తో  ఈ చిత్రం  రూపుదిద్దుకుంటోంది. భారతీయ సినిమా చరిత్రలోనే ఇదొక అతిపెద్ద ప్రాజెక్ట్ కానుంది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ (VFX), అద్భుతమైన వార్ సీక్వెన్స్‌లు, భారీ సెట్‌లతో ఈ చిత్రాన్ని రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు.

ALSO READ : రూ.2 కోట్లతో తీసిన సినిమా.. రూ.352 కోట్లకు పైగా కలెక్షన్స్..

పెన్ మూవీస్ బ్యానర్‌పై జయంతిలాల్ గడ, ఆర్‌వి స్టూడియోస్ మరియు శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ విజువల్ వండర్‌ను నిర్మిస్తున్నారు. 2027లో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాలోని మిగతా నటీనటులు మరియు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.