ఈ20 పెట్రోల్ పై దేశవ్యాప్తంగా ఆందోళనలు: రాహుల్ గాంధీ

ఈ20 పెట్రోల్ పై దేశవ్యాప్తంగా ఆందోళనలు: రాహుల్ గాంధీ
  • ‘ఎక్స్’ వేదికగా వీడియోను షేర్ చేసిన ప్రతిపక్ష నేత రాహుల్ 

న్యూఢిల్లీ: ఈ20 (ఇథనాల్ కలిపిన పెట్రోల్)తో కేంద్రం నేరుగా ప్రజల జేబుల్లో నుంచి డబ్బులు దొంగిలిస్తోందని లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.ఈ20తో సామాన్య ప్రజల కార్లు, స్కూటర్లు దెబ్బతింటుండటంతో వారి జీవితాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ త్వరలోనే  దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేపడుతుందని వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం రాహుల్ ఎక్స్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. "ఈ20 పెట్రోల్ సమస్య చాలా తీవ్రమైనది. 

సాధారణంగా 'దాల్ మే కుచ్ కాలా హై(ఎక్కడో చిన్న లోపం)' అంటాం.  కానీ ఈ20 విషయంలో మాత్రం అంతా మోసమే జరుగుతోంది. దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. దాంతో మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమస్యల జాబితా కూడా పెరిగింది. కానీ పర్లేదు. మేం ఈ20 సమస్యపై కూడా పెద్ద పోరాటమే చేస్తం. ఎందుకంటే ఇది ప్రజల కార్లు, స్కూటర్లను దెబ్బతీస్తోంది. వారి జీవితాలను నాశనం చేస్తోంది. అంతేకాకుండా, నేరుగా వారి జేబుల్లో నుంచి డబ్బులను కేంద్రం దొంగిలిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ20 పెట్రోల్‌‌‌‌ను ప్రోత్సహించడం వల్ల వినియోగదారులపై ఇంధన భారం విపరీతంగా పెరిగిపోయింది. 

తక్కువ ధరలకే ఇంధనం లభిస్తుందని హామీ ఇచ్చినప్పటికీ వాహనదారులు అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది. ఈ20 ప్రధానంగా ఇథనాల్ ఉత్పత్తిదారులకే లాభం చేకూరుస్తోంది" రాహుల్ ఆరోపించారు. కాగా,  ఈ అంశంపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ కూడా ఎక్స్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. "ఇథనాల్ కలపడం వల్ల డీజిల్ ధర లీటరుకు రూ. 50కి తగ్గుతుందని.. పెట్రోల్‌‌‌‌ రూ. 55కే లభిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గతంలో చెప్పారు. కానీ ఇప్పటిదాకా ఎక్కడా ధరలను తగ్గించలేదు" అని  పేర్కొన్నారు.