ఎయిర్‌టెల్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్: రూ.999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో ఆపిల్ సేవలు ఫ్రీ

ఎయిర్‌టెల్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్: రూ.999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో ఆపిల్ సేవలు ఫ్రీ

టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. రూ.999 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను మరింత ఆకర్షణీయంగా మారుస్తూ ఆపిల్ సేవలను జోడించింది. ఇప్పటివరకు కేవలం ఐక్లౌడ్+ సేవలను మాత్రమే అందిస్తుండగా.. తాజాగా ఇందులో ఆపిల్ టీవీ, ఆపిల్ ఆర్కేడ్‌లను కూడా చేర్చినట్లు టెలికాం కంపెనీ అధికారికంగా వెల్లడించింది.

ఈ సరికొత్త ప్లాన్ ద్వారా కుటుంబ సభ్యులకు కనెక్టివిటీతో పాటు అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ అనుభూతి లభించనుంది. రూ.999 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కింద ముగ్గురు సభ్యులు గల కుటుంబం అన్ లిమిటెడ్ డేటా, ఫాస్ట్‌లేన్ టెక్నాలజీ, స్పామ్ ప్రొటెక్షన్‌తో పాటు వివిధ ఎంటర్‌టైన్‌మెంట్ బెనిఫిట్స్ పొందవచ్చు. తాజా అప్‌డేట్‌తో ఈ ప్లాన్‌ తీసుకునే కస్టమర్‌లకు క్లౌడ్ స్టోరేజ్, ప్రీమియం సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఎలాంటి యాడ్స్ లేని గేమింగ్ సేవలు ఒకే వేదికపై లభిస్తాయి.

ఆపిల్ ఐక్లౌడ్+ సేవలతో వినియోగదారులు తమ ఫోటోలు, ముఖ్యమైన ఫైళ్లు, కాంటాక్ట్‌లు, పాస్‌వర్డ్‌లను సేఫ్ గా క్లౌడ్‌లో బ్యాకప్ చేసుకోవచ్చు. అలాగే ఆపిల్ టీవీ ద్వారా అవార్డు గెలుచుకున్న ఒరిజినల్ షోలు, సినిమాలను ఎంజాయ్ చేయవచ్చు. మరోవైపు ఆపిల్ ఆర్కేడ్ ద్వారా వందలాది ఆకర్షణీయమైన మొబైల్ గేమ్స్‌ను ఎలాంటి అంతరాయాలు, ఇన్-యాప్ కొనుగోళ్లు లేకుండా ఉచితంగా ఆడుకోవడానికి వీలవుతుంది.

ఈ సరికొత్త ఆఫర్‌పై ఎయిర్‌టెల్ మార్కెట్ ఆప్స్ డైరెక్టర్ అమిత్ త్రిపాఠి మాట్లాడుతూ.. కస్టమర్ల రోజువారీ డిజిటల్ జీవితాన్ని మరింత సులభతరం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. కనెక్టివిటీ, ఎంటర్ టైన్మెంట్, క్లౌడ్ స్టోరేజ్ అన్నీ ఒకే ప్లాన్‌లో లభించేలా ఈ సేవలను తీర్చిదిద్దామని తెలిపారు. అర్హత ఉన్న కస్టమర్లు ఎయిర్‌టెల్ యాప్ ద్వారా,  ఎయిర్‌టెల్ స్టోర్‌ను సందర్శించి సులభంగా తమ ప్లాన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని కంపెనీ కస్టమర్లకు వెళ్లడించింది.