భూముల అంశంపై జరుగుతున్న చర్చ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే జూరాల వివాదాన్ని బీఆర్ఎస్ తెరపైకి తెచ్చిందని రాష్ట్ర మంత్రి వాకిటీ శ్రీహరి విమర్శించారు. రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వంపై ఉసిగొల్పే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.
మంత్రి మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జలాల వినియోగంపై ప్రతి ప్రభుత్వ హయాంలో ఎంత నీరు వాడారో పూర్తి లెక్కలు ఉన్నాయని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యత తగ్గిన విషయం అందరికీ తెలిసినా, బీఆర్ఎస్ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో కూడా జూరాల డ్యామ్‌పై ఇలాంటి ప్రచారమే చేశారని గుర్తుచేశారు.
తాగునీటి కంటే రాజకీయాలే బీఆర్ఎస్‌కు ముఖ్యం
తాగునీటి సమస్యపై బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సమయంలో బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వాకిటీ శ్రీహరి అన్నారు. ప్రభుత్వం రైతులకు పరిస్థితిని వివరించి సర్దిచెబుతుంటే, బీఆర్ఎస్ మాత్రం వారిని రెచ్చగొడుతోందని విమర్శించారు.
కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు. 299 టీఎంసీలే తెలంగాణకు సరిపోతాయని ఒప్పుకున్నది బీఆర్ఎస్ కాదా? మన వాటాను ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించింది కూడా అదే ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేదని బీఆర్ఎస్‌ను మంత్రి నిలదీశారు. ఇప్పుడు జూరాల వద్ద హంగామా చేయడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.
కర్ణాటక నుంచి నీటి విడుదల కోసం ఇప్పటికే అక్కడి ముఖ్యమంత్రితో ప్రభుత్వం మాట్లాడిందని తెలిపారు. కర్ణాటకను అడుక్కోమంటూ బీఆర్ఎస్ నేతలు వెటకారంగా మాట్లాడడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.
రాష్ట్రాన్ని ఆర్థికంగా, సాగునీటి పరంగా సంక్షోభంలోకి నెట్టింది గత ప్రభుత్వమేనని వాకిటీ శ్రీహరి ఆరోపించారు. తెలంగాణ రైతులకు “మరణ శాసనం” రాసిందీ బీఆర్ఎస్ పాలనేనని వ్యాఖ్యానించారు.రైతుల పంటలను కాపాడే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసిన మంత్రి, బీఆర్ఎస్ అవకాశవాద రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. పాలమూరు ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదని ఆయన పేర్కొన్నారు.
