జూరాల కోసం కర్ణాటక వెళ్తున్నాం.. బీఆర్ఎస్‌ది రాజకీయ లబ్ధి కోసమే: మంత్రి జూపల్లి

జూరాల కోసం  కర్ణాటక వెళ్తున్నాం.. బీఆర్ఎస్‌ది రాజకీయ లబ్ధి కోసమే: మంత్రి జూపల్లి

జూరాల జలాల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చురుకుగా చర్యలు తీసుకుంటోందని, ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈరోజు కర్ణాటకకు వెళ్లి నీటి విడుదలపై చర్చలు జరుపుతామని చెప్పారు. ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ ధర్నాకు దిగిందని, వారి లక్ష్యం రాజకీయ లబ్ధి మాత్రమేనని విమర్శించారు.

తాగునీటికి 3 టీఎంసీలు తప్పనిసరి

జూరాల జలాశయంలో కనీసం 3 టీఎంసీల నీటిని తాగునీటి కోసం నిల్వ ఉంచాల్సిందే అని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు నీళ్లు ఇవ్వడంపై ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ప్రస్తుతం జూరాలలో తాగునీటి అవసరాలకు మించి సాగునీటికి సరిపడా నీరు లేదన్నారు. అన్ని వాస్తవాలు తెలిసినా బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టించే ఆందోళనలు చేస్తోందని ఆరోపించారు.

5 టీఎంసీలతో 5 లక్షల ఎకరాలు ఎలా సాగు?

రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణం ఎవరో ప్రజలు ఆలోచించాలని జూపల్లి అన్నారు. ఐదు–ఆరు టీఎంసీల నీటితో ఐదు లక్షల ఎకరాల సాగు ఎలా సాధ్యమవుతుందో బీఆర్ఎస్ చెప్పాలన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టులో కూడా కేవలం 5–6 టీఎంసీలే అందుబాటులో ఉండగా, అక్కడ సుమారు నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అవసరమని వివరించారు.గతంలో తెలంగాణ కృష్ణా జలాల్లో కేవలం 33 శాతం మాత్రమే వినియోగించగా, ప్రస్తుతం అది 45 శాతానికి పెరిగిందని మంత్రి తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను గత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించిన ఆయన, రైతులపై ప్రేమ ఉన్నట్లు బీఆర్ఎస్ కేవలం నటిస్తోందని విమర్శించారు.