IIT ముంబై క్యాంపస్ లో సీలింగ్ ఫ్యాన్స్ తీసేశారు.. స్టూడెంట్స్ ఆత్మహత్యలకు పరిష్కారం ఇదా..?

IIT ముంబై క్యాంపస్ లో సీలింగ్ ఫ్యాన్స్ తీసేశారు.. స్టూడెంట్స్ ఆత్మహత్యలకు పరిష్కారం ఇదా..?

ముంబైలోని  ఐఐటీ బాంబే (IIT Bombay) క్యాంపస్‌లో బిటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న సాహిల్ వాకోడే అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని, గందరగోళాన్ని నింపింది. 

మహారాష్ట్రలోని యవత్మల్ జిల్లాకు చెందిన సాహిల్, ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చదువుతున్నాడు. గత శుక్రవారం సాయంత్రం పోవై క్యాంపస్‌లోని తన హాస్టల్ రూంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందాడు. అయితే ఈ ఘటనతో అప్రమత్తమైన ఐఐటీ యాజమాన్యం క్యాంపస్‌లో కీలక మార్పు చేపట్టింది. 

విద్యార్థులు ఉరివేసుకునే అవకాశాల్లేకుండా హాస్టల్ గదుల్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్లను తీసేసి, వాటి స్థానంలో గోడకు అమర్చే 'వాల్ ఫ్యాన్లను' (Wall Fans) ఏర్పాటు చేస్తోంది. 

క్యాంపస్‌లోని హాస్టల్ రూమ్స్  రేనోవేషన్ పనుల్లో భాగంగా హాస్టళ్లకు  తీసుకొచ్చిన వాల్ ఫ్యాన్ల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. గతంలో జూలై నెలలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నప్పుడే ఈ ఫ్యాన్ల మార్పుపై చర్చ జరగ్గా, ఇప్పుడు సాహిల్ మరణంతో యాజమాన్యం ఈ నిర్ణయాన్ని మరింత వేగవంతం చేసింది. 

ఫ్యాన్లు మారిస్తే ఆత్మహత్యలు ఆగుతాయా ? 
ఐఐటీ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురి నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం సీలింగ్ ఫ్యాన్లను మార్చడం వల్ల విద్యార్థుల ఆత్మహత్యల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదని ఎన్‌సిపి ప్రతినిధి అనీష్ గవాండే అభిప్రాయపడ్డారు.

"దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ కాలేజీల్లో సీలింగ్ ఫ్యాన్లకు బదులు వాల్ ఫ్యాన్లు పెడితే ఆత్మహత్యలు ఆగిపోతాయని ఐఐటీ బాంబే  నిజంగా భావిస్తోందా ?" అని ఆయన ప్రశ్నించారు.  గత 20 ఏళ్లలో వివిధ ఐఐటీ క్యాంపస్లలో మొత్తం 117 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన గుర్తుచేశారు. భౌతిక మార్పుల కంటే విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించడం, సరైన కౌన్సెలింగ్ ఇవ్వడం, మానసిక ఆరోగ్య సహాయాన్ని అందించడంపై యాజమాన్యాలు దృష్టి పెట్టాలని కోరారు.