జీవితంలో ఎక్కడో మొదలవుతాం.. కానీ కష్టపడే తత్వం, పట్టుదల ఉంటే ఎంతటి ఉన్నత శిఖరాలకైనా చేరుకోవచ్చని నిరూపించాడు ఒక తెలుగు యువకుడు. ఉదయం పూట పిజ్జా డెలివరీలు చేస్తూ.. కష్టాల కడలిని ఈదిన ఒక సాధారణ విద్యార్థి.. నేడు ఆస్ట్రేలియాలో 3 పిజ్జా ఫ్రాంచైజీలకు ఓనర్‌గా ఆ దేశ పౌరుడిగా ఎదిగిన అద్భుతమైన ప్రయాణం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి..
పిజ్జా షాప్‌లో పని నుంచి..
భారత్ నుంచి ఉన్నత చదువుల కోసం 11 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లిన ఈ యువకుడు.. తొలుత తాను చదువుకున్న రంగంలో ఉద్యోగం సంపాదించలేకపోయాడు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడంతో జీవనం కోసం ఒక పిజ్జా షాప్‌లో ఫుల్ టైమ్ ఉద్యోగంలో చేరాడు. ఆర్డర్లు తయారు చేయడం, కస్టమర్లకు పిజ్జాలు డెలివరీ చేయడం లాంటి చిన్న పనులతో తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఎండ అనక, వాన అనక రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. అలా 3 ఏళ్ల పాటు అదే షాప్‌లో పనిచేసి కొంత డబ్బు కూడబెట్టుకున్నాడు. తన కష్టంతో పాటు కొద్దిగా భాగస్వామ్యంతో అదే పిజ్జా షాప్‌లో ఒక ఫ్రాంచైజీని దక్కించుకున్నాడు. ఇక్కడే అతని జీవితం పూర్తిగా మారిపోయింది.
పెరిగిన సంపాదన.. లగ్జరీ లైఫ్
వ్యాపారంలో వచ్చిన అనుభవం, కష్టపడే తత్వంతో ఆ బిజినెస్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాడు. కాలక్రమేణా వ్యాపారం మరింత విస్తరించడంతో మరో 2 పిజ్జా ఫ్రాంచైజీలను కూడా కొనుగోలు చేశాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో భారత్‌కు వచ్చి వివాహం చేసుకుని తన భార్యను కూడా ఆస్ట్రేలియాకు తీసుకెళ్లాడు. ఆర్థికంగా స్థిరపడిన తర్వాత ఆస్ట్రేలియాలో సొంతంగా ఇల్లు, BMW కారు కొనుక్కున్నాడు. అలాగే హైదరాబాద్‌లోనూ ఒక అద్భుతమైన ఇల్లు నిర్మించి, తన తల్లిదండ్రులను ఆస్ట్రేలియాకు తీసుకెళ్లి తన సంతోషంలో భాగం చేసుకున్నాడు.
ఆస్ట్రేలియా పౌరుడిగా గుర్తింపు..
కొద్ది రోజుల క్రితం ఈ యువకుడు తన కుటుంబంతో కలిసి అధికారికంగా ఆస్ట్రేలియా పౌరసత్వాన్ని పొందాడు. 11 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లాడు. ప్రారంభ రోజుల్లో పిజ్జా డెలివరీలు చేస్తూ ప్రాణం పెట్టి కష్టపడ్డాడని ఈ మధురమైన మైలురాయిని అతని బావ, ప్రముఖ ఎంటర్‌ప్రెన్యూర్ వినీత్ కె ఎక్స్‌లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆ యువకుడి పట్టుదలను ప్రశంసిస్తూ అభినందనలు తెలుపుతున్నారు. డిగ్రీలు, సర్టిఫికెట్ల కంటే కష్టపడే తత్వమే జీవితంలో గొప్ప విజయాలను తెచ్చిపెడుతుందని ఈ జర్నీ నిరూపించింది.
