- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కూసుమంచి/ఖమ్మం రూరల్, వెలుగు : అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ నెల 15 నుంచి ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం కలెక్టర్ దివాకరతో కలిసి పలు పనులకు శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సాయి గణేశ్ నగర్, సత్యనారాయణపురం, ఇందిరమ్మ కాలనీలలో తిరుగుతూ అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల స్వరూపాన్ని మార్చేందుకు భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తున్నామన్నారు.
ఏదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ.100 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో తుమ్మ చెట్లు పెరగడం, రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండడం వంటి సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటి శాశ్వత పరిష్కారం కోసం అవసరమైన డ్రైనేజీ నిర్మాణంతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, ఆర్ అండ్ బీ ఎస్ఈ యుగంధర్, పంచాయతీ రాజ్ ఎస్ఈ. వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
