రాణి ముఖర్జీ ఇంట్లో తీవ్ర విషాదం.. కన్నుమూసిన తల్లి కృష్ణ ముఖర్జీ!

రాణి ముఖర్జీ ఇంట్లో తీవ్ర విషాదం.. కన్నుమూసిన తల్లి కృష్ణ ముఖర్జీ!

బాలీవుడ్ నటి  రాణి ముఖర్జీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి కృష్ణ ముఖర్జీ (75) మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె  ఈ రోజు ( సెప్టెంబర్ 22, 2026 )  తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా రాణి ముఖర్జీ కుటుంబానికి తమ గాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

రాణి ముఖర్జీ తల్లి కృష్ణ ముఖర్జీ మరణ వార్తను యాష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) అధికారికంగా ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. తీవ్ర దుఃఖంతో ఈ వార్తను పంచుకుంటున్నాం. రాణి ముఖర్జీ తల్లి శ్రీమతి కృష్ణ ముఖర్జీ ఈ మధ్యాహ్నం మరణించారు. ఈ క్లిష్ట సమయంలో మీ ప్రేమ, ప్రార్థనలు, మద్దతుకు ముఖర్జీ కుటుంబం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తోంది. ఈ తీవ్ర దుఃఖ సమయంలో కుటుంబ సభ్యుల వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరుతున్నాం అని యాష్ రాజ్ ఫిల్మ్స్  తెలిపింది.

కృష్ణ ముఖర్జీ కేవలం సినీ నటి తల్లిగానే కాకుండా.. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆమె బెంగాలీ సినీ పరిశ్రమలో ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్‌గా అనేక పాటలు పాడి శ్రోతలను అలరించారు. ముఖర్జీ కుటుంబానికి సినీ పరిశ్రమతో సుదీర్ఘ అనుబంధం ఉంది. రాణి తండ్రి, దివంగత రామ్ ముఖర్జీ ప్రముఖ దర్శకుడు కాగా, సోదరుడు రాజా ముఖర్జీ కూడా చిత్ర పరిశ్రమలోనే కొనసాగుతున్నారు.

వివిధ సినీ వేడుకలు, పూజా కార్యక్రమాల్లో రాణి ముఖర్జీతో కలిసి కృష్ణ ముఖర్జీ తరచూ కనిపించేవారు. తల్లితో తనకున్న అపారమైన ప్రేమానురాగాలను, అనుబంధాన్ని రాణి పలు ఇంటర్వ్యూలలో పంచుకున్నారు. 'గులామ్', ''కుచ్ కుచ్ హోతా హై', 'సాథియా', 'బ్లాక్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో అలరించిన రాణి ముఖర్జీ, ఇటీవల 'మర్దానీ 3' చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తల్లి మరణంతో తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయిన రాణి ముఖర్జీకి సినీ లోకం అండగా నిలుస్తోంది...