కొణిజర్ల, వెలుగు: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని దుద్దిపూడి నుంచి చిన్నమునగాలకు వెళ్లే రహదారిపై వాగుపై ఉన్న పాత వంతెనను నాగ్‌పూర్–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ సంస్థ తొలగించి కొత్త వంతెన నిర్మించింది. అయితే దుద్దిపూడి–చిన్నమునగాల రహదారిని వంతెనకు ఇరువైపులా పూర్తి స్థాయిలో అనుసంధానం చేయకపోవడంతో రైతులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
వంతెనను రహదారి కన్నా ఎత్తుగా నిర్మించడంతో వాహనాలు ఎక్కడం, దిగడం కష్టంగా మారింది. వర్షాల సమయంలో ఇరువైపులా పోసిన మట్టి కొట్టుకుపోయి గుంతలు పడ్డాయి. దీంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ రోడ్డు రెండు గ్రామాల ప్రజలు, రైతులకు ప్రధాన రహదారి కావడంతో పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటలను తరలించే సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు వినతులు ఇచ్చినా చర్యలు తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు.
ఇప్పటికైనా గ్రీన్‌ఫీల్డ్ హైవే ఆఫీసర్లు స్పందించి వంతెనకు ఇరువైపులా రహదారిని గ్రావెల్‌తో పటిష్ఠం చేసి, వర్షాలకు మట్టి కొట్టుకుపోకుండా చర్యలు చేపట్టాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు.
