వెలుగు ఓపెన్ పేజీ.. జనన, మరణాల నమోదు సవరణ బిల్లు సౌలభ్యమేనా?

వెలుగు ఓపెన్ పేజీ.. జనన, మరణాల నమోదు సవరణ బిల్లు సౌలభ్యమేనా?

లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభలో ఇటీవల ఆమోదం పొందిన జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు 2026 పౌరుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 1969 చట్టంలోని సెక్షన్ 13(3)ను  సవరించిన ఈ బిల్లు ఆలస్యంగా జనన, మరణాలను నమోదు చేసుకునే ప్రక్రియను మార్చింది.
2 సంవత్సరాలలోపు ఆలస్యం: ఇప్పటిలాగే జిల్లా కలెక్టర్, సబ్- డివిజనల్ మేజిస్ట్రేట్ లేదా అధీకృత ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉత్తర్వు అవసరం.

2 సంవత్సరాలు దాటిన ఆలస్యం: ఇకపై జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఉత్తర్వు తప్పనిసరి.  అంటే కోర్టును ఆశ్రయించి  సంఘటనను  ధృవీకరించుకోవాలి. 2023 సవరణతోనే జనన ధృవీకరణ పత్రం పాఠశాల ప్రవేశం, ఓటరు జాబితా, పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్,  ప్రభుత్వ ఉద్యోగాలకు పుట్టిన తేదీ,  స్థలానికి  ప్రధాన రుజువుగా  మారింది. అంతేకాక కేంద్ర, రాష్ట్రాలు డిజిటల్ డేటాబేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు సృష్టించి, ఆ డేటాను రిజిస్ట్రార్ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పంచుకోవాలని కూడా ఆ చట్టం చెబుతోంది.

సవరణ అవసరం ఎందుకు?

ధృవీకరణపత్రం విలువ పెరిగేకొద్దీ, దానిని మోసపూరితంగా పొందే ప్రయత్నాలు కూడా పెరిగాయి. అందుకే మోసాలను అరికట్టి, పత్రాల విశ్వసనీయతను పెంచేందుకు ప్రభుత్వం 2 సంవత్సరాల తర్వాత న్యాయపరమైన ధృవీకరణను తీసుకొచ్చింది.  కోర్టులకు బాధ్యత అప్పగించడం వల్ల పరిపాలన ఏకపక్షంగా పత్రాలు ఇవ్వడం లేదా తిరస్కరించడం అనే ఆరోపణల నుండి తప్పించుకోవచ్చు. ఈ సవరణ సామాన్యులు, పేదలకు భారంగా మారే ప్రమాదం ఉంది.  మారుమూల గ్రామాల  ప్రజలు,  పత్రాలు లేని వలస కూలీలు కోర్టు చుట్టూ తిరగడం, న్యాయవాది ఫీజులు భరించడం కష్టం.

ప్రమాణాల స్పష్టత లేకపోవడం: 2 సంవత్సరాల తర్వాత మోసం ఎందుకు పెరుగుతుంది? దానికి ఎలాంటి సాక్ష్యాలు కావాలి? అనే దానిపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. పరిపాలన భారం పెరగనుంది. ఇప్పటికే ఆలస్యమైన కేసులు ఎక్కువగా ఉంటాయి. వాటన్నిటినీ 
కోర్టులకు పంపితే న్యాయవ్యవస్థపై మరింత భారం పడుతుంది. ఈ సవరణ అధికారిక నిశ్చయతకు ప్రాధాన్యత ఇస్తుంది.  

అంటే ఒకటి రెండు తప్పుడు పత్రాలు వచ్చినా పర్వాలేదు కానీ,  సిస్టం మొత్తం నమ్మదగినదిగా ఉండాలి అనే ఆలోచన. కానీ ఈ క్రమంలో కొంతమంది అర్హులైన పౌరులు బలైపోయే ప్రమాదం ఉంది. రాజ్యసభ ఈ బిల్లుపై లోతైన చర్చ జరిపి,  సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఒక కాగితం కోసం పౌరుడు సంవత్సరాల తరబడి తిరిగే పరిస్థితి రావచ్చు.

- ఇరికి మహేష్ 

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ 
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.