సామాన్య నేరాలతో పోలిస్తే సైబర్ నేరాలు ఇటీవల విపరీతంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సైబర్ నేరాల్లో నిందితులు ఎందుకు సులభంగా సొమ్మును దోచుకోగలుగుతున్నారు..? పోలీసు, నిఘా వ్యవస్థలు వీటిని ఎలా ఎదుర్కొంటున్నాయి? ఒక దొంగ ఒకరి ఇంట్లోనో, బ్యాంకులోనో చొరబడాలంటే తీవ్రమైన భౌతిక ప్రమాదాలు, సమయ పరిమితులు, భౌగోళిక సరిహద్దులు ఇలా ఎన్నో అడ్డంకులు ఉంటాయి. అయితే సైబర్ నేరగాడికి ఈ భౌతిక పరిమితులేవీ వర్తించవు. జామతారా, మేవాత్ వంటి దేశీయ సైబర్ హాట్‌స్పాట్ల నుంచో, కాంబోడియా, మయన్మార్, నైజీరియా వంటి అంతర్జాతీయ డెన్ల నుంచో కేవలం ఒక లాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్ ద్వారా వారు ఈ దోపిడీకి పాల్పడుతున్నారు.
సైబర్ క్రైమ్ అనేది భౌగోళిక సరిహద్దులు లేని నేరం. నేరగాళ్లు ప్రజల అమాయకత్వంకంటే వారి మానసిక బలహీనతలను ఆసరాగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వస్తాయనే ఆన్‌లైన్ పార్ట్-టైమ్ జాబ్స్, నకిలీ ట్రేడింగ్ యాప్స్, క్రిప్టోకరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్స్ వంటి ప్రకటనలతో ప్రజలను తీవ్రమైన అత్యాశకు గురిచేసి ట్రాప్ చేస్తున్నారు. సైబర్ ఆర్థిక నష్టాలలో దాదాపు 60 శాతం వాటా కేవలం ఈ పెట్టుబడి మోసాలదే కావడం గమనార్హం. సీబీఐ, ఈడీ అధికారులమంటూ భయపెట్టే డిజిటల్ అరెస్ట్ మోసాలు, లోన్ యాప్‌ల ద్వారా వేధించే సైబర్ ఎక్స్‌టార్షన్ వంటి పద్ధతులతో బాధితులను తీవ్ర భయాందోళనలకు గురిచేసి క్షణాల్లో లక్షల రూపాయలను లాగేసుకుంటున్నారు.
ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్
ఈ మోసాల వెనుక ఒక పక్కా ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ ఉంటుంది. తొలుత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ అయిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌లలో ఆకర్షణీయమైన ప్రకటనలతో బాధితులను ఆకర్షిస్తారు. ఆపై వారిని కొన్ని ప్రత్యేక వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులలో చేరుస్తారు. ఈ గ్రూపులలో వందలాది మంది సభ్యులు ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ వారిలో మెజారిటీ ప్రొఫైల్స్ సదరు సైబర్ ముఠాకు చెందిన నకిలీ ఖాతాలే. వారు రోజువారీగా తమకు వచ్చిన నకిలీ లాభాల స్క్రీన్‌షాట్లను పెడుతూ బాధితుడిలో నమ్మకాన్ని పెంచుతారు.
నమ్మకం కుదిరిన తర్వాత, బాధితుడి చేత అసలైన స్టాక్ మార్కెట్ యాప్‌ల తరహాలోనే కనిపించే ఒక నకిలీ అప్లికేషన్, వెబ్ డాష్‌బోర్డ్‌ను డౌన్‌లోడ్ చేయిస్తారు. ప్రారంభంలో బాధితుడు చిన్న మొత్తాన్ని (ఉదాహరణకు రూ.10,000) ఇన్వెస్ట్ చేసినప్పుడు, ఆ నకిలీ డాష్‌బోర్డ్‌లో అది రూ.15,000 అయినట్లు చూపిస్తారు. నమ్మకం కలగడం కోసం ఆ రూ.5,000 లాభాన్ని బాధితుడి నిజమైన బ్యాంక్ ఖాతాకు విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తారు.
దీనితో పూర్తిగా బుట్టలో పడిన బాధితుడు తన జీవితకాల పొదుపు మొత్తాన్ని, ఫిక్స్‌డ్ డిపాజిట్లను, బంగారాన్ని అమ్మి రూ.20 లక్షల నుంచి రూ. కోటి వరకు ఇన్వెస్ట్ చేస్తాడు. ఆ డాష్‌బోర్డ్‌లో లాభాలు కోట్లలో చూపిస్తున్నప్పటికీ, బాధితుడు ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోబోయినప్పుడు అసలు మోసం బయటపడుతుంది. టాక్స్ కట్టాలని, ఆథరైజేషన్ ఫీజు కావాలని మరింత డబ్బు గుంజి, ఆ తర్వాత సదరు యాప్, గ్రూపులను క్లోజ్ చేసి నిందితులు అదృశ్యమవుతారు.
వ్యవస్థాగత సవాళ్లు, నిందితుల గుర్తింపులో అడ్డంకులు
సైబర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించే సమయానికే నేరగాళ్లు అత్యంత వేగవంతమైన మనీ నెట్‌వర్క్ ద్వారా దోచుకున్న సొమ్మును వందలాది నకిలీ, మ్యూల్ అకౌంట్లలోకి మళ్లిస్తారు. మ్యూల్ అకౌంట్లు అంటే గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల నుంచో, విద్యార్థుల నుంచో కొద్దిపాటి కమీషన్ ఇచ్చి కొనుగోలు చేసిన బ్యాంక్ ఖాతాలు. ఈ ఖాతాల ద్వారా నిధులను మళ్లించిన వెంటనే వాటిని క్రిప్టో కరెన్సీ రూపంలోకి మార్చడం, విదేశీ ఖాతాలకు నెట్టడం ద్వారా దర్యాప్తు సంస్థల కంటికి చిక్కకుండా చేస్తారు.
వీరు వాడే సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు అన్నీ ఇతరుల పేర్లపైనే రిజిస్టర్ అయి ఉంటాయి. డార్క్ వెబ్, వర్చువల్ ప్రైవేట్
నెట్‌వర్క్స్ (వీపీఎన్), ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ చానెళ్లను ఉపయోగించడం వల్ల నిందితుల అసలు ఐపీ అడ్రస్‌లను, డిజిటల్ ఫుట్‌ప్రింట్స్‌ను ట్రేస్ చేయడం డిజిటల్ ఫోరెన్సిక్స్ బృందాలకు సైతం పెద్ద సవాలుగా మారుతోంది.
గోల్డెన్ అవర్.. 1930 హెల్ప్‌లైన్ నంబర్
నేరానికి ముందే అడ్డుకట్ట వేయాలనే వ్యూహంతో తెలంగాణ పోలీస్ శాఖ ఇటీవల ఒక విప్లవాత్మక సాంకేతిక ల్యాబ్ T-SPARK (Telangana Smart Policing using AI -based Research and Knowledge)ను ప్రారంభించింది. సాంకేతికత ఎంత ఆధునికీకరణ చెందినప్పటికీ, సైబర్ నేరాల నియంత్రణలో చివరి రక్షణ కవచం ప్రజల అవగాహన మాత్రమే. సైబర్ మోసానికి గురైన మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు. ఈ సమయంలోనే బాధితుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలి, అధికారిక జాతీయ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి.
కేవలం పోలీసు శాఖ చర్యలవల్లో, ఏఐ ల్యాబ్స్‌వల్లో మాత్రమే సైబర్ నేరాలను 100% నిర్మూలించడం సాధ్యం కాదు. బ్యాంకింగ్ వ్యవస్థలు నకిలీ ఖాతాల సృష్టిని అడ్డుకోవడంలో కఠినంగా వ్యవహరించాలి. టెలికాం కంపెనీలు నకిలీ సిమ్ కార్డుల నియంత్రణకు కఠిన కేవైసీ నిబంధనలను అమలు చేయాలి. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి పౌరుడూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా, ఓటీపీలను పంచుకోకుండా ఉన్నప్పుడే ఈ డిజిటల్ దోపిడీకి శాశ్వతంగా అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది.
- డా. కట్కూరి
సైబర్ నిపుణుడు & పాలసీ విశ్లేషకుడు
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
