వెలుగు స్పెషల్: అమెరికా, సౌదీలకు సవాలుగా మారిన హౌతీలు

వెలుగు స్పెషల్: అమెరికా, సౌదీలకు సవాలుగా మారిన హౌతీలు

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టుగా అమెరికా- ఇరాన్‎ల మధ్య యుద్ధం సౌదీ అరేబియా - హౌతీల మధ్య యుద్ధంగా రూపాంతరం చెందింది.  యెమన్​లోని ఇరాన్ అనుకూల హౌతీలు సౌదీలోని చమురు సదుపాయాలను విధ్వంసం చేయడమే కాకుండా ఎర్ర సముద్రంలోని బాబ్ ఎల్ మండేబ్ జలసంధిని స్వాధీనం చేసుకుని సౌదీ వాణిజ్య నౌకలను దిగ్భంధనం చేసి, అంతర్జాతీయ చమురు రంగాన్ని తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టారు. హార్మూజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా సౌదీ అరేబియా బాబ్ ఎల్ మండేబ్‌‌ను  వినియోగిస్తున్నది. యెమన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్న సౌదీ అరేబియాను  హౌతీలు లక్ష్యంగా చేసుకున్నారు. 
 
మొఖా ఓడ రేవును, కొన్ని కీలకమైన ద్వీపాలను హౌతీలు ఆక్రమించుకున్నారు. ఇప్పటికే సౌదీలోని ఈస్ట్- వెస్ట్ క్రూడాయిల్  పైప్ లైన్ 
పై హౌతీలు డ్రోన్ దాడులు చేసి తీవ్రంగా నష్టపరిచారు. బాబ్ ఎల్ మండేబ్ జలసంధిని  హౌతీలు తమ అధీనంలోకి  తెచ్చుకోవడంతో భారత్ కూడా ఇబ్బందుల్లో పడింది.  పలు ఆసియా, ఐరోపా దేశాలకు చమురు సరఫరా నిలిచిపోయింది. 

హిందూ మహాసముద్రం నుంచి  ఎర్ర సముద్రానికి గల ఏకైక కీలక సముద్ర మార్గం‘గేట్ ఆఫ్  టియర్స్’గాపిలిచే 32 కిలోమీటర్ల వెడల్పుగల అంతర్జాతీయ రవాణా మార్గం ‘స్ట్రయిట్ ఆఫ్  బాబ్ ఎల్ మండేబ్’. ఈ మార్గం మూతబడితే ప్రత్యామ్నాయ మార్గం మరింత వ్యయప్రయాసలతో దూరభారంతో కూడుకున్న వ్యవహారంగా మారుతుంది. 

 భారత్‌‌కు సౌదీ నుంచి పక్షం రోజులకు రావలసిన ఇంధన నౌకలు సౌత్ ఆఫ్రికా లోని  కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిరిగి రావడానికి రెట్టింపు సమయం పడుతుంది.  ఒకవైపు హార్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు, మరోవైపు ఎర్ర సముద్రం పై హౌతీల ఆధిపత్యం, మొఖా పోర్టు స్వాధీనం  వెరసి భారత్‌‌లో చమురు సంక్షోభం ముదిరేలా చేసింది. హార్మూజ్ జలసంధి  ప్రపంచ ఇంధనానికి ఆయువు పట్టుకాగా, ఇప్పుడు రెడ్‌‌ సీపై హౌతీలు పట్టు సాధించడం మరో ముప్పుగా పరిణమించింది. 

హౌతీలపై దాడికి అమెరికా వెనకడుగు

ఈ పరిస్థితుల్లో  తమకు అధునాతన ఆయుధాలు కావాలని అమెరికాను సౌదీ అభ్యర్ధించినా ఫలితం లేకపోయింది.  యెమన్​లోని  హౌతీలు అమెరికా  మేడ్  సౌదీ  ఎఫ్ -15 ను కూల్చడంతో   అమెరికా కూడా హౌతీల జోలికిపోవడం లేదు. హౌతీలతో అమెరికా రహస్యం ఒప్పందం చేసుకుని, రెడ్‌‌ సీలో  తమ నౌకలను కాపాడుకుంటుందనే వార్తల నేపథ్యంలో తమకు సాయం చేయాలన్న సౌదీ  విన్నపాన్ని అమెరికా  తోసిపుచ్చడంలో ఆశ్చర్యం లేదు.  ఇదే సందర్భంలో టర్కీ, పాక్, సౌదీ మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందం 
నీరుగారింది. ఈ నేపథ్యంలో  సౌదీ పాలకులు   ఇజ్రాయెల్  సాయం కోరినట్లు వార్తలు వెలువడ్డాయి. హౌతీల దాడితో ముదిరిన మిడిల్ ఈస్ట్ యుద్ధం ప్రపంచాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలో  పడేసింది.  

ప్రపంచంపై యుద్ధ ప్రభావం

ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే  భారత్‌‌లో కూడా  చమురు సంక్షోభం తీవ్రతరం కావడం తథ్యం. విదేశీ ఇంధనంపై ఆధారపడ్డ పాక్​లో  పరిస్థితులు చేజారిపోతున్నాయి.  ప్రజలపైన, వ్యాపారులపైన పాక్ ప్రభుత్వం  ఆంక్షలు విధించింది. పెళ్లిళ్లలో  ఒకే 
వంటకాన్ని  పరిమితం చేసింది. వాహనాల కొనుగోలు, ప్రయాణాలపై  ఆంక్షలు  విధించారు. పాక్​లో  పెట్రోలు ధర  సుమారు రూ. 400లకు చేరింది. 

మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో కొనసాగుతుండగా, రష్యా ఆయిల్ రిఫైనరీలపై  ఉక్రెయిన్ భీకర దాడులు చేసి విధ్వంసం చేయడంతో చమురు సరఫరా సంక్షోభంలో పడింది. ఇదే సందర్భంలో రష్యా నుంచి చమురు కొంటున్న భారత్, చైనాలపై అమెరికా  100 శాతం టారిఫ్ విధించడం పైశాచిక చర్యగా భావించక తప్పదు. అమెరికా చట్టసభలు ట్రంప్ చేతికి టారిఫ్​ల కొరడా అందించడం అనుచితం.  

రష్యా విషయంలో ఇతర దేశాలపై ఆంక్షలు విధిస్తున్న ట్రంప్  అమెరికా పవర్ గ్రిడ్ల కోసం రష్యా నుంచి యురేనియం కొనుగోలు చేయడం ద్వంద్వ నీతి కాదా?  ట్రంప్ చేతిలో  ఇజ్రాయెల్  సలహాతో  ఇరాన్‌‌పై  అకారణ  యుద్ధానికి పూనుకొన్న ట్రంప్ ప్రపంచ దేశాల ప్రజలను ఇక్కట్లపాలు చేస్తున్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్య ప్రజలు సతమతమవుతున్నారు.  కొన్ని దేశాల ప్రజలు విద్యుత్ కొరతతో, ఆహార కొరతతో అలమటిస్తున్నారు.  

ఎంతకాలం యుద్ధాలు కొనసాగిస్తారు..? ఎంతకాలం ప్రజలను ఇబ్బంది పెడతారు..? ప్రపంచ శాంతి కోసం ఏర్పడిన ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు అమెరికాను నిలువరించలేవా? ఇరాన్ తో శాంతి ఒప్పందానికి  అంగీకరింపజేయడంలో ప్రపంచ దేశాలు ఎందుకు విఫలమవుతున్నాయి? ఎంతకాలం అమెరికాకు దాసోహం చేస్తారు? ప్రజాభీష్టానికి విరుద్ధంగా సాగుతున్న యుద్ధాలు మానవ మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నాయి.

 హౌతీల పైచేయి

అమెరికా నుంచి కొనుగోలు చేసిన  యుద్ధ విమానాన్ని కూల్చిన హౌతీలు ఎర్ర సముద్రం, సూయజ్ కెనాల్‌‌పై ఆధిపత్యం సాధించారు. హౌతీలు ఇరాన్‌‌కు బలంగా మారారు. మక్కా  కూడా ప్రమాదంలో పడింది. ఇటీవల హౌతీల దాడుల  దృష్ట్యా సౌదీ ఆత్మరక్షణలో పడింది.  భౌగోళిక  పరిస్థితులు, గెరిల్లా తరహా వ్యూహాలు హౌతీలకు ఆయుధంగా మారడం విశేషం. సౌదీ అరేబియా భద్రత సంక్షోభంలో పడింది. 

అమెరికా అండ చూసుకుని  తిరుగు లేదనుకున్న సౌదీ భయకంపితమైనది. రియాద్  భద్రతకు ముప్పు వాటిల్లడమే కాకుండా, చమురు మౌలిక సదుపాయాలపై దాడులు, ఎర్ర సముద్రంలో నావల దిగ్భంధనం  వలన సౌదీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అరామ్ కో ‘ఈస్ట్- వెస్ట్ ఆయిల్ పైప్ లైన్’ మూసివేయడంతో ప్రపంచం మరింత చమురు సంక్షోభంలోకి నెట్టడమైనది. 

- సుంకవల్లి సత్తిరాజు 

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ 
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
 రచన 700 పదాలకు మించరాదు.