- కొరడాతో కొడుతూ వృద్ధురాలికి చిత్రహింసలు
- దెయ్యం పట్టిందనే అనుమానంతో కుటుంబ సభ్యుల దుశ్చర్య
- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
అబిడ్స్, వెలుగు: ఎవరో చేతబడి చేశారని, దెయ్యం పట్టి ఉండవచ్చనే అనుమానంతో ఓ వృద్ధురాలిని కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. దెయ్యం వదులుతుందనే మూఢ నమ్మకంతో ఆమెను చెట్టుపై మేకుల సాయంతో నిలబెట్టి కొరడా ఝులిపించారు. ఈ ఘటన సోషల్మీడియా ద్వారా బయటికి రావడంతో మానవ హక్కుల కమిషన్సుమోటోగా కేసు నమోదు చేసింది.
వివరాల్లోకెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెం గ్రామానికి చెందిన షేక్ షకీనాబీ అనే వృద్ధురాలు అనారోగ్యానికి గురైంది. అయితే ఆమెకు దెయ్యం పట్టిందని, చేతబడి చేశారనే అనుమానంతో కుటుంబసభ్యులు, బంధువులు భావించారు. జులైలో ఆమెను నిర్మానుష్య వ్యవసాయ పొలానికి తీసుకెళ్లి చెట్టుపైకి ఎక్కించారు. చెట్టుకు మేకులు కొట్టి వాటిపై వృద్ధురాలిని నిలబెట్టారు. అంతటితో ఆగకుండా విచక్షణారహితంగా కొరడాతో కొట్టారు. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకున్నట్లు సమాచారం.
సుమోటో కేసు నమోదు చేసిన హెచ్ఆర్సీ
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలు దినపత్రికల్లో కథనాలు వచ్చాయి. వీటిని సుమోటోగా తీసుకున్న హెచ్ఆర్సీ చైర్‌పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన వృద్ధురాలి జీవించే హక్కు, గౌరవం, మానవ హక్కులకు విఘాతం కలిగించినట్లేనని పేర్కొన్నారు. అక్టోబర్ 27లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ను ఆదేశించారు. బాధితురాలి ప్రస్తుత పరిస్థితి, అందుతున్న వైద్యం, ఘటనకు బాధ్యులపై తీసుకున్న చర్యలు నివేదికలో పొందుపరచాలని సూచించారు.
