వెలుగు స్పెషల్: హైదరాబాద్‌‌‌‌కు బెంగళూరు పాఠం

వెలుగు స్పెషల్: హైదరాబాద్‌‌‌‌కు బెంగళూరు పాఠం

కర్నాటక రాజధాని బెంగళూరులో  కొత్త సంస్థల నమోదు డిసెంబర్ 2025లో 1,630 ఉండగా.. జూన్ 2026లో 1,193కి పడిపోయింది. ఆగస్టులో ఉద్యోగ ప్రకటనలను సూచించే సూచీ జులైతో పోలిస్తే 9 శాతం తగ్గింది. మరోవైపు 2023 జులై నుంచి 2026 జులై వరకు మూడేళ్లలో ఉద్యోగుల భవిష్యనిధి పరిధిలోని ఉద్యోగుల సంఖ్య సుమారు 8శాతం పెరిగింది. హౌ ఇండియా లైవ్స్ సేకరించిన బెంగళూరు గణాంకాల్లోని భిన్న ధోరణులు.  కొత్త సంస్థలు తగ్గడం, ఉద్యోగ ప్రకటనలు తగ్గడం, మరోవైపు అధికారిక ఉద్యోగుల సంఖ్య పెరగడం వంటి పరిణామాలు ఒక నగర ఆర్థిక పరిస్థితిని ఒక్క మాటతో వివరించలేమని చెబుతున్నాయి.

హైదరాబాద్‌‌‌‌ గణాంకాల సంగతేంటి..?

 హైదరాబాద్‌‌‌‌కు ఇలాంటి నెలవారీ ప్రజా లెక్కలు ఎక్కడ ఉన్నాయి?  తెలంగాణలో ఆగస్టు 2026లో ద్విచక్ర వాహనాల నమోదులు 55,771గా నమోదయ్యాయి. ఈ గణాంకం మొత్తం తెలంగాణకు సంబంధించినదే తప్ప హైదరాబాద్ నగరానికి మాత్రమే సంబంధించినది కాదు. ఇలాంటి వివరాలను హైదరాబాద్ స్థాయిలో విడిగా ప్రజల ముందుంచగల వ్యవస్థ మనకు అవసరం. 

కొత్త సంస్థలు ఎన్ని నమోదయ్యాయి, అధికారిక ఉద్యోగాలు ఎన్ని పెరిగాయి, ఉద్యోగ అవకాశాలు ఎలా మారాయి, జీవన వ్యయం ఏ దిశలో సాగుతోంది?  మొదలైన గణాంకాలు వివిధ శాఖల్లో విడివిడిగా ఉంటే సరిపోదు.  వాటిని  ఒకచోట సమీకరించి నెలనెలా 
ప్రజలకు అందుబాటులో ఉంచాలి. 

బెంగళూరు విశ్లేషణలో కూడా పరిమితులు ఉన్నాయి. ఉద్యోగ సూచీలో  గిగ్ ఉపాధి,  కళాశాల నియామకాలు లేవు. ఆహార ధరలకు నగర ధరల బదులు రాష్ట్ర సగటులను ఉపయోగించారు. కాబట్టి అక్కడి సూచికను సంపూర్ణ జీవన చిత్రంగా చూడలేం. అయినా ఒక నగరాన్ని నిరంతరం గణాంకాల ద్వారా పరిశీలించే ప్రయత్నం జరుగుతోంది. 

హైదరాబాద్‌‌‌‌లో మాత్రం మరింత విస్తృతమైన, ప్రభుత్వ ఆధారాలతో కూడిన వ్యవస్థ అవసరం.  ఈ గణాంకాలు మనకు తెలియజేయాల్సిన అసలు వాస్తవం.. నగరం ఎంత పెరిగిందన్నది కాదు, ఆ పెరుగుదలలో అవకాశాలు ఎవరికి ఎంత 
దక్కుతున్నాయన్నది. 

ప్రతి నెల హైదరాబాద్ ప్రజా జీవన సూచికను విడుదల చేయాలి

నగర సగటు ఆదాయం పెరిగినా.. వెనుకబడిన తరగతులు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలు, అసంఘటిత కార్మికులు, స్థానిక యువతకు ఉపాధి, ఆదాయ అవకాశాలు ఎంత పెరిగాయో ప్రత్యేకంగా తెలియాలి. కొత్త ఆర్థిక కేంద్రాల్లో అవకాశాలు విస్తరిస్తున్న సమయంలో  పాత నగరం, శివారు ప్రాంతాలు,  తక్కువ ఆదాయ వర్గాల పరిస్థితిలో ఏ మార్పు వస్తోందో కూడా లెక్కల్లో కనిపించాలి.  

ఒకే  నగర సగటు ఈ అంతరాలను దాచిపెట్టవచ్చు. అందువల్ల హైదరాబాద్ అభివృద్ధి గణాంకాల్లో సామాజిక వర్గం, ప్రాంతం, లింగం, ఆదాయ స్థాయి వంటి విభజనలు సాధ్యమైన చోట తప్పనిసరిగా ఉండాలి.  నగర సగటు కంటే అవకాశాల పంపిణీ ముఖ్యం. దీనికి ప్రభుత్వం  స్పష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

  రాష్ట్ర ప్రణాళికా శాఖ లేదా  గణాంకశాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి తేదీకల్లా హైదరాబాద్ ప్రజా జీవన సూచికను బహిరంగంగా విడుదల చేయాలి. కొత్త సంస్థలు, ఉద్యోగాలు, వేతనాలు, జీవన వ్యయం, గృహ అందుబాటు, ప్రజా రవాణా, విద్య, ఆరోగ్యం వంటి అంశాల గణాంకాలను సంబంధిత శాఖల నుంచి సేకరించి ఒకే వేదికపై ఉంచాలి.

ప్రజల జీవనమే కొలమానం

సాధ్యమైనచోట ప్రాంతం, సామాజిక వర్గం, లింగం, ఆదాయ స్థాయి ఆధారంగా వివరాలను విడదీయాలి.  అప్పుడు ప్రభుత్వ విధానాల ప్రభావాన్ని ప్రజలు స్వయంగా పరిశీలించగలరు. పెట్టుబడులు ఎంత వచ్చాయనే సమాచారంతోపాటు వాటిద్వారా ఏర్పడిన అవకాశాల్లో స్థానికుల వాటా ఎంత, బలహీన వర్గాలకు ప్రయోజనం ఎంత చేరిందో కూడా స్పష్టమవుతుంది. 

హైదరాబాద్ అభివృద్ధిని ఇకపై నగర రూపంతో కాకుండా ప్రజల జీవనంతో కొలవాల్సిన అవసరం ఉంది. బెంగళూరు చూపించిన విధానం ఒక నగరానికి అనేక ముఖాలు ఉంటాయని గుర్తుచేస్తోంది. హైదరాబాద్ కూడా తన అభివృద్ధిని బహిరంగ గణాంకాలతో నిరంతరం పరీక్షించుకోవాలి. నగరం ఆర్థికంగా ఎంత ఎత్తుకు ఎదిగిందన్నది కాదు, ఆ నగరంలో నివసించే మనిషి జీవితం ఎంత మెరుగుపడిందన్నదే హైదరాబాద్ అభివృద్ధికి అసలైన కొలమానం కావాలి. 

 - పాపని నాగరాజు
సోషల్​ ఎనలిస్ట్

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ 
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
 రచన 700 పదాలకు మించరాదు.