రైతులకు సర్కార్ గుడ్ న్యూస్.. వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి రూ.147 కోట్ల నిధులు కేటాయింపు 

రైతులకు సర్కార్ గుడ్ న్యూస్.. వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి రూ.147 కోట్ల నిధులు కేటాయింపు 

హైదరాబాద్‌‌, వెలుగు: వ్యవసాయంలో యాంత్రీకరణను పెంచి రైతుల శ్రమ, సాగు ఖర్చులను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు.. నచ్చిన పరికరాన్ని, నచ్చిన కంపెనీ నుంచి కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ కల్పించనుంది. కొనుగోలు చేసిన పరికరానికి వర్తించే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేసే విధానాన్ని అమలు చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి రూ.147.91 కోట్లు కేటాయించింది.

పెరిగిన సబ్సిడీ నిధులు 

కొత్త విధానంలో రైతే తన పొలానికి అవసరమైన యంత్రాన్ని ఎంపిక చేసుకుని.. నిర్దేశిత ప్రమాణాలు పాటించే కంపెనీ నుంచి కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ప్రాంతీయ అవసరాలు, పంటల సాగు విధానం, రైతుల ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా పరికరాలను ఎంచుకునే వెసులుబాటు కల్పించనుంది. 

2025–26లో యాంత్రీకరణ పథకానికి రూ.71 కోట్లు కేటాయించగా.. రూ.63.11 కోట్లు ఖర్చు చేసి 15,565 వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులకు అందించినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. ఈ ఏడాది కేటాయింపులను రూ.147.91 కోట్లకు పెంచింది. రైతుల నుంచి వస్తున్న డిమాండ్‌‌ ఆధారంగా ఆధునిక యంత్రాలు, డ్రోన్ల సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వనుంది.

ఎంపిక కమిటీలో రైతులకు చోటు

పరికరాల ఎంపికలో రైతుల అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఎంప్యానెల్‌‌మెంట్‌‌ కమిటీలో రైతు ప్రతినిధులకు చోటు కల్పించారు. శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఇంజినీర్లు, వ్యవసాయశాఖ అధికారులు, ఆదర్శ రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు ఇందులో భాగస్వాములు కానున్నారు. రాష్ట్రంలో విస్తరిస్తున్న ఆయిల్‌‌పామ్‌‌ సాగుకు అవసరమైన ఆధునిక యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

 ఇతర దేశాల్లో వినియోగిస్తున్న యంత్రాలను గుర్తించి.. అవసరమైన వాటిని దిగుమతి చేసుకుని రైతులకు అందించనుంది. ఫ్యాక్టరీల వద్దే పరికరాలను అందుబాటులో ఉంచడం ద్వారా శ్రమ, సమయం, సాగు వ్యయాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. 

మరోవైపు కూలీల కొరత, పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో యాంత్రీకరణను పెంచడం ద్వారా దుక్కి దున్నడం, విత్తనాలు వేయడం, కలుపు నివారణ, పంట సంరక్షణ, కోత పనులను తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఆధునిక సాంకేతికత వినియోగంతో ఉత్పాదకత పెంచడం, రైతుల శ్రమను తగ్గించడం, సాగు ఖర్చులను నియంత్రించడం లక్ష్యంగా వ్యవసాయశాఖ ముందుకు సాగుతోంది.

50 శాతం వరకు సబ్సిడీ

యంత్ర పరికరాల కొనుగోలుపై చిన్న, సన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం వరకు, ఇతర రైతులకు 40 శాతం వరకు సబ్సిడీ అందించనుంది. ఈ సబ్సిడీని నేరుగా రైతు ఖాతాలో జమ చేయడం ద్వారా మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

పరికరాల నాణ్యతలోనూ రాజీ పడకుండా తయారీదారులు, సరఫరాదారులు అందించే యంత్రాలను ఫార్మ్ మెషినరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్‌‌స్టిట్యూట్‌‌, కేంద్ర వ్యవసాయశాఖ గుర్తించిన సంస్థల ద్వారా పరీక్షించిన తర్వాతే పథకంలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం పరికరాల సరఫరా కోసం 444 కంపెనీలు ఎంప్యానెల్‌‌మెంట్‌‌కు దరఖాస్తు చేసుకోగా కొన్నింటికే గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు సమాచారం.