Sr ఎన్టీఆర్‌ను అవమానించారా?.. సత్య సీన్‌పై రచ్చ: ‘కొరియన్ కనకరాజు’ వివాదంపై వరుణ్ తేజ్ క్లారిటీ

Sr ఎన్టీఆర్‌ను అవమానించారా?.. సత్య సీన్‌పై రచ్చ: ‘కొరియన్ కనకరాజు’ వివాదంపై వరుణ్ తేజ్ క్లారిటీ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కొరియన్ కనకరాజు’. ఈ సినిమా నిన్న ఆగస్ట్ 7న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మిరాయ్ బ్యూటీ రితికా నాయక్ హీరొయిన్ గా నటించిన ఈ చిత్రంలో కమెడియన్ సత్య కీలక పాత్ర పోషించారు. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ.. ప్రేక్షకులను నవ్వించడంలో సక్సెస్ అయింది. అయినప్పటికీ, ఈ మూవీలో సీనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి సత్య చేసిన ఓ ఇమిటేషన్ సీన్ సోషల్ మీడియాలో వివాదానికి దారితీసింది. ఈ క్రమంలోనే హీరో వరుణ్ తేజ్, వివాదానికి దారీతీసిన విషయంపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

అసలు వివాదం ఏంటి?

కమెడియన్ సత్య..ఇందులో  సీనియర్ ఎన్టీఆర్ నటించిన 'యుగపురుషుడు'లోని ఫేమస్ "అమేచ్యురిష్" పాపులర్ డైలాగ్‌ను ఇమిటేట్ చేస్తూ కనిపిస్తారు. అయితే, ఈ సన్నివేశానికి సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు నందమూరి ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ వంటి లెజెండరీ నటుడిని అవమానించేలా ఈ సీన్ ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. అంతేగాకుండా కొరియన్ కనకరాజు మేకర్స్ ను ట్యాగ్ చేస్తూ సదరు సీన్ ని వెంటనే తొలిగించాలని డిమాండ్ చేస్తూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే సదరు అంశంపై వరుణ్ తేజ్ క్లారిటీ ఇస్తూ ఎండ్ కార్డు పెట్టారు. 

ట్రోలింగ్‌కు.. ఇమిటేషన్‌కు తేడా ఉంది: వరుణ్ తేజ్

ALSO READ : పళ్లబురుసు కోసం కొడుకుపై తండ్రి కేసు

ఈ వివాదంపై రియాక్ట్ అయిన హీరో వరుణ్ తేజ్.. తాము ఎవరినీ కించపరచాలనే ఉద్దేశంతో ఆ సన్నివేశాన్ని తెరకెక్కించలేదని స్పష్టం క్లారిటీ ఇచ్చారు. “ట్రోలింగ్ చేయాలన్న ఉద్దేశంతో ఆ సీన్స్ తీయలేదు. ట్రోలింగ్‌కు, ఇమిటేషన్‌కు తేడా ఉంది. ఎవరైనా గొప్ప గొప్ప నటులనే ఇమిటేట్ చేస్తారు. ఈ సన్నివేశాలన్నింటినీ గత నవంబర్‌లోనే అదే డైలాగ్‌తో షూట్ చేశాం” అని వరుణ్ తేజ్ తెలిపారు.

అంతేకాదు.. తన గత చిత్రం ‘ఎఫ్3’లోనూ, తాను కల్యాణ్ బాబాయ్ నటించిన ‘వకీల్ సాబ్’ పాత్రను సరదాగా ఇమిటేట్ చేశానని గుర్తుచేశారు. అలాగే ‘కొరియన్ కనకరాజు’ ప్రమోషన్స్‌లో, సినిమాలోనూ సత్య.. కృష్ణ, చిరంజీవి వంటి సీనియర్ నటులను ఇమిటేట్ చేశారని చెప్పారు. ఇవన్నీ కేవలం ప్రేక్షకులను నవ్వించడానికి చేసినవేనని, ఎవరి పట్లా అమర్యాదగా వ్యవహరించాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

Sr ఎన్టీఆర్ రియల్ హీరో ఆఫ్ టాలీవుడ్..

సీనియర్ ఎన్టీఆర్‌పై తనకు ఉన్న గౌరవాన్ని కూడా వరుణ్ తేజ్ స్పష్టం చేశారు. “ఎన్టీఆర్ రియల్ హీరో ఆఫ్ టాలీవుడ్. హీరోకు నిర్వచనం ఇచ్చిందే ఆయన. అలాంటి ఆయన్ను తక్కువ చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. మిమిక్రీ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఆడియన్స్ ను ఎంటర్‌టైన్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ సీన్ తీశాం” అని వరుణ్ తేజ్ అన్నారు.

గతంలోనూ స్టార్ హీరోలు ఒకరినొకరు ఇమిటేట్ చేసుకున్న సందర్భాలను ఆయన గుర్తుచేశారు. ‘ఎఫ్2’లో తాను, వెంకటేష్ కలిసి ANRలా డ్యాన్స్ చేశామని, ‘శివాజీ’ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్.. మెగాస్టార్ చిరంజీవిని ఇమిటేట్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కాబట్టి ఈ సన్నివేశాన్ని కూడా అదే కోణంలో చూడాలని ఆయన కోరారు. మొత్తంగా.. ‘కొరియన్ కనకరాజు’పై సత్య ఇమిటేషన్ సీన్ కారణంగా తలెత్తిన వివాదంపై వరుణ్ తేజ్ ఇచ్చిన వివరణతో ఈ అంశానికి తెరపడుతుందా? లేదా సోషల్ మీడియాలో ఇంకా కొనసాగుతుందా? అనేది చూడాలి. 

‘కొరియన్ కనకరాజు’పై పాజిటివ్ బజ్..

మరోవైపు వివాదాన్ని పక్కన పెడితే ‘కొరియన్ కనకరాజు’కు థియేటర్లలో మంచి స్పందన వస్తోందని వరుణ్ తేజ్ తెలిపారు.  ‘ప్రీమియర్స్ నుంచి మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది.  మొదటి నుంచి ఈ సినిమాపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆడియన్స్  సినిమాలోని ప్రతి ఎపిసోడ్‌‌ను  ఎంజాయ్ చేస్తున్నారు. సత్య  కామెడీకి మరింత  రెస్పాన్స్ వస్తోంది.  ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోవాలని ఈ సినిమా చేశాం.  ఇప్పుడు థియేటర్లలో వాళ్లు అలా ఎంజాయ్ చేస్తుంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది.  బాబు పుట్టిన తర్వాత ఈ సక్సెస్ రావడం నాకు మరింత స్పెషల్‌‌గా అనిపిస్తోంది’ అని చెప్పాడు