- సాగర్, ఎస్‌ఆర్‌ఎస్‌పీలో నీటి నిల్వలు ఇంకా తక్కువే
- ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ
- సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, వెలుగు: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతుల ప్రయోజనాల పరిరక్షణకు జిల్లా నీటిపారుదల సలహా మండళ్లను తక్షణమే పునరుద్ధరించాలని పౌరసరఫరాల, నీటిపారుదల శాఖల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీఎస్ సంజయ్ జాజుతో కలిసి ఆయన పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ప్రతి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నీటిపారుదల, వ్యవసాయ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై జలాశయాల నీటి నిల్వలు, వర్షపాతం అంచనాలు, తాగునీటి అవసరాలు, సాగు పరిస్థితులపై చర్చించాలన్నారు. రైతులకు శాస్త్రీయమైన మార్గదర్శకాలు అందించాలని సూచించారు.
ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాల్లో వెంటనే సలహా మండళ్ల సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ మండళ్లు కేవలం నీటి విడుదలపై నిర్ణయాలు తీసుకునే వేదికలు మాత్రమే కాకుండా, రైతులు ఏ పంట సాగు చేస్తే నష్టపోకుండా ఉంటారో వారికి అవగాహన కల్పించాలని చెప్పారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాజెక్టుల పరిధిలో రైతులు వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటల సాగుకు వెళ్లొద్దని సూచించారు. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఇంకా ఆశించిన స్థాయికి చేరలేదని తెలిపారు.
నేల స్వభావం, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటి అవసరమున్న ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. వచ్చే వేసవిలో తాగునీటి కొరత తలెత్తకుండా ఇప్పటి నుంచే అవసరమైన నీటి నిల్వలను పరిరక్షించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్ తాగునీటి అవసరాలకు తగిన నిల్వలను తప్పనిసరిగా కాపాడాలని సూచించారు.
కొత్తగా 16 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 61 లక్షల మందిని ప్రజాపంపిణీ వ్యవస్థలో చేర్చి, సుమారు 16 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.06 కోట్ల రేషన్ కార్డుల ద్వారా 3.42 కోట్ల మంది లబ్ధిదారులకు సేవలు అందుతున్నాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 15న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు. అదే రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు.
