కెనడాలో RSSపై నిషేధం.. మోహన్ భగవత్ ఎంట్రీని అడ్డుకోవాలని ఎంపీల లేఖ

కెనడాలో RSSపై నిషేధం.. మోహన్ భగవత్ ఎంట్రీని అడ్డుకోవాలని ఎంపీల లేఖ

కెనడాలో RSSపై నిషేధం విధించాలని, ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్‌ను దేశంలోకి అనుమతించకూడదని డిమాండ్ చేస్తూ న్యూ డెమోక్రటిక్ పార్టీ(NDP)కి చెందిన ఇద్దరు ఎంపీలు కెనడా ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులకు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భగవత్ ఆగస్టు చివర్లో కెనడాలో పర్యటించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది. న్యూ డెమోక్రటిక్ పార్టీ విదేశాంగ వ్యవహారాల విమర్శకురాలు హీథర్ మెక్‌ఫెర్సన్, ఇమ్మిగ్రేషన్, పబ్లిక్ సేఫ్టీ విమర్శకురాలు జెన్నీ క్వాన్ ఈ లేఖ ద్వారా ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.

మోహన్ భగవత్‌కు నో ఎంట్రీ డిమాండ్..
మోహన్ భగవత్ కెనడాలో అడుగుపెట్టకుండా నిరోధించాలని NDP ఎంపీలు కోరారు. RSSపై ఉన్న ఆరోపణలు, మైనారిటీ వర్గాల భద్రత, కెనడాలోని కొన్ని వర్గాలపై బెదిరింపులు, వేధింపులకు సంబంధించిన అంశాలను వారు ప్రస్తావించారు. కెనడా ఇమ్మిగ్రేషన్ చట్టంలోని సంబంధిత నిబంధనలను ఉపయోగించి భగవత్‌తో పాటు ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉన్న వ్యక్తుల ప్రవేశాన్ని పరిశీలించాలని జెన్నీ క్వాన్ కోరారు. అయితే ఇవన్నీ NDP, దాని మద్దతుదారులు చేస్తున్న ఆరోపణలు, డిమాండ్లేనని గమనించాలి.

కెనడాలో ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయాలని డిమాండ్..
ఆర్ఎస్ఎస్ ను కెనడాలో పూర్తిగా నిషేధించాలని NDP గతంలోనూ డిమాండ్ చేసింది. ఆర్ఎస్ఎస్ ను ఉగ్రవాద సంస్థల లిస్టులో చేర్చడంతో పాటు.. దానికి అనుబంధంగా ఉన్న నెట్‌వర్క్‌లపై ఆంక్షలు విధించాలని కూడా పార్టీ నేతలు గతంలో కోరారు. కెనడాలో విదేశీ జోక్యం, మైనారిటీలపై బెదిరింపులు, హింసను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ అంటోంది.

నిజ్జర్ హత్య తర్వాత..
ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడాలో ఆర్ఎస్ఎస్ పై NDP విమర్శలు మరింత తీవ్రతరం అయ్యాయి. అప్పట్లో NDP నేత జగ్మీత్ సింగ్ ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించాలన్న డిమాండ్‌తో ప్రచారం చేశారు. ఆర్ఎస్ఎస్ తో పాటు హిందుత్వ భావజాలానికి సంబంధించిన సంస్థలపై కూడా కెనడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. దీంతో ఆర్ఎస్ఎస్ అంశం కెనడా రాజకీయాల్లో భారత్-కెనడా సంబంధాలకు సంబంధించిన సున్నితమైన అంశంగా మారింది.
ఆర్ఎస్ఎస్ బ్యాన్ డిమాండ్‌కు కారణాలివే

RSSపై బ్యాన్ డిమాండ్‌కు ప్రధాన కారణాలు:

* మైనారిటీలపై ద్వేషం 
* హింసను ప్రోత్సహిస్తుందన్న ఆరోపణలు 
* కెనడాలోని కార్యకర్తలు, విద్యావేత్తలను బెదిరించడం
* వేధించడంపై వచ్చిన ఆరోపణలు 
* విదేశాల్లో భారతీయ రాజకీయ నెట్‌వర్క్‌ల ప్రభావం 
* కెనడాలోని కొన్ని మైనారిటీ వర్గాల భద్రతకు ముప్పు ఉందన్న ఆందోళనలు

ALSO READ : ఈ20 పెట్రోల్ పై దేశవ్యాప్తంగా ఆందోళనలు

200కుపైగా సంస్థల నుంచి కూడా డిమాండ్:
మోహన్ భగవత్‌కు కెనడాలో ప్రవేశం నిరాకరించాలని కోరుతూ 200కుపైగా కెనడియన్ సివిల్ సొసైటీ సంస్థలు ఆగస్టు 6న సంయుక్త లేఖ విడుదల చేసినట్లు ఈ వర్గాలు తెలిపాయి. అలాగే మానవ హక్కులు, కార్మిక, మతపరమైన సంస్థలతో కూడిన మరో కూటమి కూడా కెనడా పబ్లిక్ సేఫ్టీ మంత్రిని భగవత్ ప్రవేశాన్ని అడ్డుకోవాలని కోరింది. RSSపై ఉన్న ఆరోపణల ఆధారంగా కెనడియన్ చట్టాల ప్రకారం భగవత్ ప్రవేశాన్ని నిరాకరించేందుకు అవకాశం ఉందని వారు ప్రభుత్వానికి సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నారు. మెుత్తానికి మోహన్ భగవత్ పర్యటనపై NDP, కెనడియన్ పౌరసంఘాల నుంచి వచ్చిన డిమాండ్లు మరోసారి ఆర్ఎస్ఎస్ అంశాన్ని అంతర్జాతీయ రాజకీయ చర్చలోకి తీసుకొచ్చాయి.  భగవత్ పర్యటన విషయంలో కెనడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.