లా ప్రాక్టీస్ వదిలేసి రోజుకు రూ.50 వేలు సంపాదిస్తున్న లేడీ లాయర్: వైరల్ స్టోరీ!

లా ప్రాక్టీస్ వదిలేసి రోజుకు రూ.50 వేలు సంపాదిస్తున్న లేడీ లాయర్: వైరల్ స్టోరీ!

జీవితం అంటే కేవలం గంటల తరబడి ఆఫీసుల్లో కుర్చీలకు అతుక్కుపోవడం కాదు.. మనసుకు నచ్చిన పని చేస్తూ, ప్రశాంతంగా బతకడమే అసలైన సంతోషం అని నిరూపించింది బ్రిటన్‌కు చెందిన ఒక యువతి. క్రిమినల్ డిఫెన్స్ లాయర్ కావాలనే కలతో ఏళ్ల తరబడి కష్టపడి, కార్పొరేట్ ఉద్యోగం చేసిన లిజ్ ఈస్ట్ అనే 30 ఏళ్ల మహిళ.. తన లా ప్రాక్టీస్‌ను పూర్తిగా పక్కనపెట్టింది. ఇప్పుడు కుక్కలను బయటకు తీసుకెళ్లే ‘డాగ్ వాకర్’గా మారి నెలకు వేల పౌండ్లు సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

లీగల్ రంగంలోకి రావడానికి ముందు లిజ్4 సంవత్సరాలు క్రిమినల్ డిఫెన్స్ పారాలిగల్‌గా పనిచేశారు. ఆ తర్వాత కన్సల్టెంట్‌గానూ సేవలందించారు. కోర్టు విచారణలు, జైలు విజిట్స్, క్లయింట్లతో మీటింగ్‌లు అంటూ ఆమె దినచర్య ఉదయం మొదలైతే రాత్రి వరకు ఉక్కిరిబిక్కిరి చేసేది. లండన్‌కు వెళ్లడానికి 2 గంటల ప్రయాణం, రోజుకు 12 గంటలకు పైగా పని గంటలతో ఆమె నరకం చూశారు. ఆఫీస్ అయిపోయిన తర్వాత కూడా సహోద్యోగులతో పార్టీలు, సోషలైజింగ్ అంటూ రాత్రి 10 గంటలకు ఇంటికి చేరేవారు. దీంతో తన వయసు కన్నా ఎంతో పెద్దదాడిలా అనిపించేదాన్నని ఆమె ఫీలయ్యారు. ప్రతిరోజూ జీవితం ఇదేనా అని కుమిలిపోయేదాన్ని అని లిజ్ తన పాత రోజులను గుర్తుచేసుకున్నారు.

భర్త స్పూర్తితో బోల్డ్ నిర్ణయం..
కార్పొరేట్ కల్చర్‌లో ఎంత జీతం వస్తున్నా కుటుంబ జీవితానికి, వ్యక్తిగత సంతోషానికి సమయం లేకపోవడం ఆమెను తీవ్రంగా మధనపెట్టింది. సరిగ్గా అదే సమయంలో తన భర్త డాగ్ వాకింగ్, డాగ్ బోర్డింగ్ బిజినెస్ చేస్తూ ఎంతో సంతోషంగా ఉండటం ఆమె గమనించింది. భర్త చూపే ఆసక్తి, పనిపై ఆయనకు ఉన్న మక్కువను చూసి లిజ్ తనలో తాను ప్రశ్నించుకున్నారు. "అందరూ ఇష్టపడని పనులను డబ్బా కోసం ఎందుకు చేయాలి? వీకెండ్ వచ్చిందంటే ఎందుకు భయపడాలి?" అనుకుని కార్పొరేట్ జాబ్ కి గుడ్ బై చెప్పేసారు. ఒక వ్యాన్ కొనుక్కుని మొదట్లో పబ్‌లో పనిచేస్తూనే సొంతంగా డాగ్ వాకింగ్ వ్యాపారాన్ని ప్రారంభించారు.

రోజుకు రూ.50 వేల సంపాదన.. 
ప్రస్తుతం లిజ్ రోజుకు సుమారు 20 నుంచి 30 కుక్కలను రోజుకు 4 ట్రిప్పులుగా వాకింగ్‌కు తీసుకువెళ్తున్నారు. ఒక్కో కుక్కకు గంటకు సుమారు 19 డాలర్లు ఛార్జ్ చేస్తున్నారు. ఈ లెక్కన ఆమె రోజువారీ సంపాదన భారతీయ కరెన్సీలో రూ.50వేల వరకు ఉంటోంది. పాత ఉద్యోగంతో పోలిస్తే ఇప్పుడు సగం గంటలు మాత్రమే పనిచేస్తున్నానని, కానీ ఆదాయం మాత్రం వేల పౌండ్లు ఎక్కువగా వస్తోందని సంతోషంగా చెబుతున్నారు.

సమాజం మాటలు.. లీగల్ అనుభవం
"లా చదివి, డిగ్రీలు తీసుకుని చివరికి కుక్కలను వాకింగ్ తీసుకెళ్తున్నావా?" అంటూ చుట్టుపక్కల వాళ్ళు ఎగతాళి చేశారని.. 6 సంవత్సరాల చదువు వృధా చేసుకున్నావని చాలామంది జడ్జ్ చేశారని లిజ్ తెలిపారు. అయితే ఆ ఆరు సంవత్సరాలలో నేర్చుకున్న విషయాలు తన దైనందిన జీవితంలో ఎంతో ఉపయోగపడుతున్నాయని ఆమె ధీమాగా చెబుతున్నారు.

జీవితం చాలా చిన్నది: 
డబ్బు కోసం మాత్రమే డాగ్ వాకింగ్ ఎంచుకోవద్దని, ప్రకృతిలో గడపడం, మూగజీవాలతో గడపడం ఇష్టమున్న వాళ్లే ఈ రంగానికి రావాలని ఆమె సూచిస్తున్నారు. "జీవితం చాలా చిన్నది. ఏ ఉద్యోగంలో అయితే మీరు సంతోషంగా లేరో.. అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకండి. ధైర్యంగా ముందడుగు వేయండి. నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఒక్క క్షణం కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు, పశ్చాత్తాప పడలేదు" అంటూ అసంతృప్తితో రోజూ ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు లిజ్ స్టోరీ సందేశాన్ని ఇస్తోంది.