ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్స్‌కు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. థియేటర్లలో మిస్ అయినా.. ఇలాంటి డార్క్ క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్స్‌ను ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు అలాంటి థ్రిల్లర్‌నే డిజిటల్ ఆడియన్స్ ముందుకు తీసుకొస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషీ నటించిన ‘బేబీ డూ డై డూ’ (Baby Do Die Do). డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రేపటి (సెప్టెంబర్ 23) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
హ్యూమా ఖురేషీ ఇందులో చెవిటి, మూగ మహిళా హిట్‌వుమన్‌గా కనిపించనుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. వరుస హత్యలు, పోలీసుల వేట, రివెంజ్ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్.. థియేటర్లలో చూడలేకపోయిన వారికి ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి రాబోతోంది. నచికేత్ సమంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సాకిబ్ సలీమ్, హ్యూమా ఖురేషీ కలిసి తమ Saleem Siblings బ్యానర్‌పై నిర్మించారు. జూలై 3న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ తాజాగా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది.
Baby do save the date 🥰📅 pic.twitter.com/iCrFp1bB0G
— Netflix India (@NetflixIndia) September 22, 2026
కథేంటంటే?
హ్యూమా ఖురేషీ ఇందులో బేబీ కర్మార్కర్ అనే చెవిటి, మూగ కాంట్రాక్ట్ కిల్లర్‌గా కనిపిస్తుంది. చిన్నప్పుడే తన సోదరిని కోల్పోయిన బేబీ.. ఆ ఘటన తాలూకు బాధతో పెరుగుతుంది. మరోవైపు తన హ్యాండ్లర్ పీఎం జైన్ వద్ద శిక్షణ తీసుకుని ప్రొఫెషనల్ హిట్‌వుమన్‌గా మారుతుంది. ముంబైలో తన టార్గెట్లను హతమార్చి, ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పించుకుంటూ ఉంటుంది.
ఈ క్రమంలో బేబీ జీవితంలో సిద్ధు అనే మంచి మనసున్న వ్యక్తి ప్రవేశిస్తాడు. అతడిని ప్రేమించిన బేబీ.. చివరకు సిద్ధును పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. అయితే ఆమె గతం మాత్రం ఆమెను వదిలిపెట్టదు.
కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. ఓ రియల్ ఎస్టేట్ గొడవకు సంబంధించిన వ్యవహారంలో భాగంగా జాఫర్ కట్కర్ (సికందర్ ఖేర్) అనే పెద్ద రౌడీని హత్య చేయడానికి బేబీకి కాంట్రాక్ట్ వస్తుంది. అయితే టార్గెట్ గురించి తెలుసుకున్న తర్వాత ఆమెకు షాకింగ్ నిజం తెలుస్తుంది. చిన్నతనంలో తన సోదరిని చంపింది మరెవరో కాదు.. జాఫర్ కట్కరే అసలైన హంతకుడు అని బేబీకి తెలుస్తుంది.
ఇప్పటివరకు డబ్బు కోసం కాంట్రాక్ట్ కిల్లింగ్ చేసిన బేబీకి.. ఈసారి వ్యక్తిగత ప్రతీకారం కూడా తోడవుతుంది. తన సోదరి మరణానికి కారణమైన వ్యక్తిని ఎదుర్కొనే క్రమంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది? జాఫర్‌ను చంపిందా? ఈ పోరాటంలో బేబీ ఎదుర్కొన్న పరిస్థితులేంటి? అనేదే మిగతా కథ.
