హైదరాబాద్: 2026-2027 వానాకాలం (ఖరీఫ్) సీజన్ కోసం తెలంగాణ పౌర సరఫరాల శాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం కానున్న ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అంతరాయం కలగకుండా పకడ్బందీ వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 8,283 ధాన్యం కొనుగోలు కేంద్రాలను (PPCs) ఏర్పాటు చేసి, సుమారు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
కనీస మద్దతు ధరకు అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ పొందాలంటే రైతులు కచ్చితంగా అగ్రిస్టాక్ ఫార్మర్ ఐడీ కలిగి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్‌ఎం 1638, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్‌ఎం 7715 రకాలు పండించే వారికే బోనస్ వర్తిస్తుంది.
స్టోరేజ్, హమాలీ, ట్రాన్స్‌పోర్ట్ (SHT) విధానాన్ని పక్కాగా అమలు చేస్తూ.. గోదాములు, హమాలీలు, రవాణా వాహనాలను ముందుగానే సిద్ధం చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి గోదాములు లేదా మిల్లులకు ధాన్యం తరలించే ప్రతి వాహనానికి జీపీఎస్ (VLTS) ట్రాకింగ్ తప్పనిసరి చేశారు.
క్షేత్రస్థాయి ఏర్పాట్లపై పౌర సరఫరాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ఎక్స్-అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. స్టీఫెన్ రవీంద్ర (ఐపీఎస్) జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మిల్లింగ్ దశలో మోసాలను అరికట్టడానికి కొత్తగా 'ఫిజికల్ వెరిఫికేషన్ (PV)' మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. తప్పుడు రికార్డులు సృష్టించే రైస్ మిల్లర్లు లేదా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై ఉపేక్షించేది లేదని, కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు.
