హౌతీలతో పోరుపై ట్రంప్ యూటర్న్.. చివరి క్షణంలో వెనక్కి తగ్గిన అమెరికా ప్రెసిడెంట్

హౌతీలతో పోరుపై ట్రంప్ యూటర్న్.. చివరి క్షణంలో వెనక్కి తగ్గిన అమెరికా ప్రెసిడెంట్

వాషింగ్టన్: యెమెన్‌‌‌‌లోని హౌతీ తిరుగుబాటుదారులపై వైమానిక దాడులు చేయడానికి సిద్ధమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకుని దాడిని విరమించుకున్నారు. సౌదీ అరేబియాపై హౌతీలు దాడులను తీవ్రతరం చేయడంతో తమకు సహాయం చేయాల్సిందిగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) గత మంగళవారం అమెరికాను అభ్యర్థించారు. 

ఈ మేరకు ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌‌‌‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విజ్ఞప్తిపై ట్రంప్ సందిగ్ధంలో పడ్డారు. ఇరాన్‌‌‌‌తో ఇప్పటికే కొనసాగుతున్న యుద్ధం వల్ల అమెరికా సైన్యంపై తీవ్రమైన భారం పడుతున్నందున హౌతీలతో పోరులో తలదూర్చడం తనకు ఇష్టంలేదని తెలిపారు. పరిస్థితి పూర్తిగా మారిపోతూ వచ్చిన క్రమంలో గురువారం మళ్లీ సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్ నేరుగా ట్రంప్‌‌‌‌నకు ఫోన్ చేసి హౌతీల దూకుడును అడ్డుకోవాలని కోరారు.

దీంతో ట్రంప్ తన మనసు మార్చుకుని.. హౌతీల స్థావరాలపై విరుచుకుపడేందుకు సిద్ధం కావాలని అదే రోజు పెంటగాన్ అధికారులను ఆదేశించారు. దీంతో అమెరికా బలగాలు సర్వసన్నద్ధమయ్యాయి. దాడుల కోసం లక్ష్యాలను ఖరారు చేయడంతో పాటు యుద్ధ విమానాల్లో బాంబులను నింపే ప్రక్రియ కూడా పూర్తిచేశాయి.

చివరి నిమిషంలో యూటర్న్

ఇలా దాడులకు అన్నీ సిద్ధమైన తరుణంలో ఆదివారం మధ్యాహ్నం ట్రంప్ మరోసారి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతానికైతే హౌతీలపై ఎలాంటి వైమానిక దాడులు ఉండబోవని స్పష్టంచేశారు. దాడులకు కమాండర్లు పూర్తిగా సిద్ధమయ్యాక ట్రంప్ యూటర్న్ తీసుకోవడం గమనించదగ్గ అంశం.

ఇరాన్‌‌‌‌తో ఇప్పటికే అమెరికా సైన్యం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇలాంటి టైంలో సౌదీ యుద్ధంలో నేరుగా భాగస్వామ్యం కావడంపై ట్రంప్ అంతర్గత సలహాదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అందుకే హౌతీలపై దాటికి ట్రంప్ వెనక్కి తగ్గినట్టు సమాచారం.