- డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణను రోల్ మోడల్‌గా నిలిపినం
- బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో సర్టిఫికెట్లు ఇస్తాం
- ఏఐ ట్రాన్స్‌ఫర్మేషన్ కాన్‌క్లేవ్‌లో మంత్రి కామెంట్స్
హైదరాబాద్, వెలుగు: త్వరలోనే రాష్ట్రంలో డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఏఐ, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, క్వాంటం కంప్యూటింగ్ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీలకు పాలనలో పెద్దపీట వేస్తున్నామన్నారు.
గవ్ కనెక్ట్, ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ (మీసేవ) సంయుక్తాధ్వర్యంలో శుక్రవారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో నిర్వహించిన ‘ఏఐ ట్రాన్స్‌ఫర్మేషన్ కాన్‌క్లేవ్ (తెలంగాణ)’ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాలనలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పేర్కొన్నారు.
డిజిటల్ కేబినెట్, 20 ప్రభుత్వ శాఖలను ఒకే తాటిపైకి తెచ్చేలా రియల్ టైమ్ గవర్నమెంట్ డాష్‌బోర్డ్, దేశంలోనే తొలి ఏఐ ఆధారిత డేటా ఎక్స్ఛేంజ్, వాట్సాప్ ద్వారా పౌర సేవల డెలివరీ, మీ టికెట్ లాంటి ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలిపారు. డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిపామన్నారు. పౌరుల డేటా భద్రతకు పెద్దపీట వేసేలా త్వరలోనే బ్లాక్‌చెయిన్ ఆధారిత సర్టిఫికెట్ల జారీకి శ్రీకారం చుడతామన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలకు టీ-ఫైబర్ ద్వారా హై-స్పీడ్ డిజిటల్ కనెక్టివిటీని అందిస్తామని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పూర్తిస్థాయిలో పేపర్‌లెస్ అడ్మినిస్ట్రేషన్‌ను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎంవో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మిత్రా సీఈవో ప్రవీణ్ పరదేశి, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఎండీ జీవీఎల్ సత్యకుమార్, నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా సీఈవో దేవేశ్ త్యాగి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ అడిషనల్ సెక్రటరీ సౌరభ్ కె. తివారీ తదితరులు పాల్గొన్నారు.
సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకోవాలి..
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితులను సవాళ్లుగా కాకుండా కొత్త అవకాశాలుగా మలుచుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన ‘హిప్లెక్స్–2026: ప్లాస్టిక్స్, పాలిమర్స్, ప్రాసెసింగ్ టెక్నాలజీ, యంత్రాల అంతర్జాతీయ ప్రదర్శన’ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షోభ సమయాల్లోనే కొత్త సాంకేతికత, నాణ్యత, ఆవిష్కరణలపై పెట్టుబడులు పెట్టే పరిశ్రమలే భవిష్యత్‌లో మార్కెట్‌ను శాసిస్తాయన్నారు. పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్లాస్టిక్స్, పాలిమర్ పరిశ్రమ దేశ తయారీ రంగంలో అత్యంత కీలకమైందని తెలిపారు.
