- నకిలీ బ్యాంక్ గ్యారెంటీలను పరిశీలించకుండానే రూ.కోట్లు కట్టబెట్టిన అధికారులు!
- పెన్‌పహాడ్‌లో మిల్లు నడవకున్నా క్లీన్‌చిట్.. మళ్లీ రూ.14 కోట్ల ధాన్యం కేటాయింపు?
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల వరుస దాడులు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) మాఫియా గుట్టును రట్టు చేస్తున్నాయి. ధాన్యం లెక్కల్లో భారీ తేడాలు, గాల్లోనే మిల్లింగ్ అయినట్లు చూపుతున్న లెక్కలు జిల్లాలో ఐఏఎస్, సివిల్ సప్లై వ్యవస్థల నిఘా లోపాన్ని ఎలుగెత్తి చాటుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో రైస్ మిల్లర్ల అక్రమాలు ఒక ఎత్తైతే, వారికి వెన్నుదన్నుగా నిలుస్తూ ప్రజాధనాన్ని లూటీ చేయిస్తున్న పౌర సరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యం మరో ఎత్తన్న విమర్శలు వస్తున్నాయి.
తనిఖీలు చేయకుండానే సర్టిఫికేట్..
నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి మిల్లులకు సీఎమ్మార్ ధాన్యం కేటాయించాక.. ఆ ధాన్యం భద్రంగా ఉందా లేదా అని ప్రతినెలా సివిల్ సప్లై అధికారులు క్షేత్రస్థాయిలో భౌతికంగా తనిఖీ చేయాలి. కానీ సూర్యాపేట జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్లు, సివిల్ సప్లై ఇన్‌స్పెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లకుండానే ఏసీ గదుల్లో కూర్చొని అంతా సవ్యంగానే ఉందంటూ తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారు. దీంతో వేల బస్తాల ధాన్యం మిల్లుల నుంచి దర్జాగా బహిరంగ మార్కెట్ తరలిపోతున్నా అధికారుల కళ్లకు కనిపించకపోవడం వెనుక పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నకిలీ బ్యాంక్ గ్యారెంటీలతో రూ.కోట్ల దందా..
కోదాడ పరిధిలోని భువనేశ్వరి రైస్ మిల్లు యజమాని నకిలీ బ్యాంక్ గ్యారెంటీ పత్రాలను సమర్పించి కోట్లాది రూపాయల విలువైన ధాన్యాన్ని పొందారు. 2022–-23 వానాకాలం సీజన్‌కు సంబంధించి రూ.3.05 కోట్ల విలువైన 1202.48 మెట్రిక్ టన్నుల టన్నుల ధాన్యం బకాయి ఉండటంతో, తర్వాతి సీజన్ కేటాయింపుల కోసం మిల్లరు ఫేక్ బ్యాంక్ గ్యారెంటీలను సృష్టించారు. గత నెలలో విజిలెన్స్ అధికారులు దాడి చేసి బ్యాంక్ ద్వారా క్రాస్ చెక్ చేయించగా ఈ నకిలీ వ్యవహారం వెలుగుచూసింది. దీంతో మిల్లు యజమానితో పాటు అతడి భార్య, ముగ్గురు కొడుకులపై కేసు నమోదైంది. అయితే గ్యారెంటీ పత్రాలను క్రాస్ చెక్ చేసుకోవాల్సిన ప్రాథమిక బాధ్యతను అధికారులు గాలికొదిలేయడం గమనార్హం.
‘జేపీ’లో గాల్లోనే మిల్లింగ్..
పెన్‌పహాడ్ మండలంలోని జేపీ రైస్ మిల్లు వ్యవహారం సివిల్ సప్లై శాఖ అవినీతికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. మిల్లు యజమానులు ధాన్యం కేటాయింపులు తీసుకున్నారే తప్ప అసలు మిల్లును నడపనే లేదు. నామమాత్రంగా కొన్ని బియ్యం చూపించి, మిగిలిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించారు. మొదటి సీజన్‌లోనే ఇన్ని అక్రమాలు జరిగితే మిల్లును బ్లాక్ లిస్టులో పెట్టాల్సింది పోయి, సివిల్ సప్లై అధికారులు అంతా బాగుందని మళ్లీ క్లీన్ చిట్ ఇచ్చి ఏకంగా మరో రూ.14 కోట్ల మేర ధాన్యాన్ని కేటాయించారు.
అధికారులపై చర్యలేవీ?
రైతుల కష్టం, ప్రభుత్వ ఖజానాకు కాపలాగా ఉండాల్సిన అధికారులే మిల్లర్లతో కుమ్మక్కయ్యారు. విజిలెన్స్ అధికారులు దాడులు చేసి అక్రమాలను నిగ్గుతేల్చినప్పుడు కేవలం మిల్లర్లపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. కానీ ఏండ్ల తరబడి తప్పుడు నివేదికలు ఇచ్చిన డిప్యూటీ తహసీల్దార్లు, సివిల్ సప్లై ఇన్‌స్పెక్టర్లు, ఫైళ్లను గుడ్డిగా ఆమోదించిన జిల్లా స్థాయి అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఫేక్ బ్యాంక్ గ్యారెంటీలను ఆమోదించిన అధికారులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి, అక్రమార్కుల నుంచి ప్రజాధనాన్ని రికవరీ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
