సూర్యాపేట, వెలుగు: 17 ఏళ్ల భూదాన్ భూముల వివాదానికి తెరపడింది. ఎట్టకేలకు మైహోమ్ సిమెంట్స్, కీర్తి సిమెంట్స్ పరిశ్రమల నుంచి 170 ఎకరాల భూదాన్ భూములను స్వాధీనం చేసుకోవాలని సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 16న అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మై హోమ్ రామేశ్వరరావు మేళ్లచెరువులో భూదాన్ భూములను ఆక్రమించినట్లు ప్రకటించారు. సీసీఎల్నుంచి సూర్యాపేట కలెక్టర్‌కు భూములు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో భూదాన్ భూముల వివాదం కారణంగా నిషేధిత జాబితాలో చేరిన రైతుల పట్టా భూములకు విముక్తి కలగనుంది.
మేళ్లచెరువులో రూ.50కోట్ల విలువైన 170 ఎకరాల భూవివాదం
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని సర్వేనెంబర్ 1057లో మొత్తం 631 ఎకరాల భూమి ఉంది. ఇందులో 170 ఎకరాల భూదాన్ భూమి, 18 ఎకరాల ప్రభుత్వ భూమి, 8 ఎకరాల దేవాదాయశాఖ భూమి ఉంది. మిగిలిన 495 ఎకరాలు పట్టాభూమి. ఈ సర్వే నంబర్ లోని భూమిలో మైహోమ్ సిమెంట్స్ ఆక్రమణలో 242 ఎకరాలు, కీర్తి సిమెంట్స్ పేర 40ఎకరాలు ఉన్నాయి.
ఈ భూముల్లో మై హోమ్ సిమెంట్ పరిశ్రమ 2009లో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రయత్నించింది. ఇవి భూదాన్ భూములని, అందులో పవర్ ప్లాంట్ ఎలా కడతారని రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతోపాటు లోకాయుక్తను ఆశ్రయించడంతో అప్పటినుంచి ఈ భూములకు సంబంధించి వివాదం కొనసాగుతోంది.
17ఏళ్లుగా కొనసాగుతున్న వివాదం
రైతులు 2009లో లోకాయుక్తను ఆశ్రయించగా 17 ఏండ్లుగా ఈ భూములపై వివాదం కొనసాగుతోంది. రైతుల ఫిర్యాదుతో లోకాయుక్త ఈ భూముల వ్యవహారం మీద ఉన్నతాధికారుల కమిటీతో విచారణ జరిపించారు. భూదాన్‌కు చెందిన 113 ఎకరాల్లో మైహోమ్ సిమెంట్స్, 40 ఎకరాల్లో కీర్తి సిమెంట్స్ కబ్జాలో ఉన్నట్లు లోకాయుక్త తేల్చింది. ఈ భూములను మై హోమ్, కీర్తి సిమెంట్స్ యాజమాన్యాల నుంచి స్వాధీనం చేసుకోవాలని 2012లోనే ఆదేశాలు జారీ చేసింది.
ఈ తీర్పును సవాలు చేస్తూ మై హోమ్, కీర్తి సిమెంట్స్ హైకోర్టుకు వెళ్లారు. లోకాయుక్త తమ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదని వారు వాదించారు. 2023 జూలై 27న హైకోర్టులోనూ వారికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కబ్జాదారులను ఖాళీ చేయించే అధికారం మేళ్లచెరువు తహసీల్దార్‌కు లేదని, భూములపై అన్ని హక్కులు భూదాన్ బోర్టుకే ఉంటాయని పేర్కొంది. దీంతో భూదాన్ బోర్డు సెక్రటరీ మై హోమ్, కీర్తి సిమెంట్స్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు.
భూములను పరిశీలించి స్వాధీనం చేసుకునే ప్రక్రియ కోసం సీనియర్ రెవెన్యూ అధికారిని నియమించారు. అయితే ఏ కారణాలవల్లనో ఈ ప్రక్రియ ముందుకు కదలలేదు. భూదాన్ భూములున్నాయన్న కారణంగా 1057 సర్వేనంబర్‌ను 22ఏ జాబితాలో చేర్చడంతో ఈ సర్వే నంబర్లోపట్టాభూములున్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎన్‌వోసీ కావాలంటూ రెవెన్యూ అధికారులు అభ్యంతరపెడుతున్నారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే కోర్టు వివాదంలో ఉన్న భూములను బ్యాంకులో తనఖా పెట్టి సిమెంట్ పరిశ్రమల వారు రూ.కోట్లలో రుణాలు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి.
అసెంబ్లీలో ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి
మైహోం రామేశ్వరరావు మేళ్లచెరువులో భూదాన్ భూములు కబ్జా చేసి సిమెంట్ పరిశ్రమ నిర్మించాడని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడం సంచలనంగా మారింది. 22ఏ నిషేధిత జాబితా వల్ల రైతుల పడుతున్న కష్టాలపై జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
చివరికి సీఎం హైహోమ్ కబ్జాలపై చేసిన ప్రకటనతో సీసీఎల్ఏ 170 ఎకరాల భూదాన్ భూములను స్వాధీనం చేసుకోవాలని, భూభారతి రికార్డులను సవరించాలని సూర్యాపేట కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. సీసీఎల్ఏ ఆదేశాలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీసీఎల్ఏ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలియగానే ఆ ప్రాంత రైతులు పటాకులు కాలుస్తూ స్వీట్లు పంచుకున్నారు.
భూదాన్ భూమిని స్వాధీనం చేసుకుంటాం
పూర్తిస్థాయిలో విచారించి సీసీఎల్ఏ భూదాన్ భూములను సిమెంట్ పరిశ్రమల కబ్జా నుంచి స్వాధీనం చేసుకోవాలని సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఇదే అంశం గురించి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. త్వరలోనే రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తాం.
- శ్రీనివాసులు, ఆర్డీవో హుజూర్‌నగర్
22ఏ జాబితా నుంచి రైతుల భూములను తొలగించాలి
కోర్టు వివాదాన్ని ఆసరాగా చేసుకుని 17 ఏళ్లుగా ఈ భూములను మైహోమ్ సిమెంట్స్ అనుభవిస్తోంది. బ్యాంకులో తనఖా పెట్టి రూ.కోట్ల బ్యాంక్ రుణాలు తీసుకొని రైతులను అనేక రకాల ఇబ్బందులు గురిచేశారు. ప్రభుత్వం వెంటనే రైతుల భూములను 22ఏ జాబితా నుంచి తొలగించాలి. మైహోమ్ సిమెంట్స్, కీర్తి సిమెంట్స్ పరిశ్రమల నుంచి భూమిని స్వాధీనం చేసుకోవాలి.
- కమతం నాగార్జున, అడ్వకేట్
