- ఫిర్యాదుపై విజిలెన్స్ ఎంక్వైరీ
గంగాధర, వెలుగు: లంచం అడిగితే తమకు సమాచారం ఇవ్వాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ విజిలెన్స్ అధికారి, రిటైర్డ్ ఎస్పీ డి.నాగరాజు సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడం ద్వారా లబ్ధిదారులకు వస్తున్న డబ్బులో కొంత ఇవ్వాలని సర్పంచ్, వార్డు సభ్యుడు డిమాండ్ చేశాడని పేర్కొంటూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యారానికి చెందిన ఓ లబ్ధిదారుడు చేసిన ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మంగళవారం విచారణ చేపట్టారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను కలుసుకొని వివరాలు సేకరించారు. డబ్బులు ఇవ్వాలని ఎవరైనా ఒత్తిడి చేశారా? అని ఆరా తీశారు. ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అమలు కావాలని, లబ్ధిదారులు మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదన్నారు. గృహ నిర్మాణ పథకం కింద చెల్లింపులు పొందే ప్రక్రియ గురించి లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. లంచం డిమాండ్ లేదా అవినీతికి సంబంధించిన సమాచారం ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 1800 599 5991కు ఫిర్యాదు చేయాలని సూచించారు. హౌసింగ్ డీఈఈ వెంకటరమణ, ఏఈ యశ్వంత్, పంచాయతీ సెక్రటరీ శ్యామల తదితరులు పాల్గొన్నారు.
